'పౌరాణికం తీస్తే తెలుగోడే తీయాలి'!

Mon Oct 03 2022 16:29:58 GMT+0530 (India Standard Time)

SsRajamouli Comments On Adipurush Teaser

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ''ఆదిపురుష్''. రామాయణ ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అందరూ ఎన్నాళ్ళుగానో వేచి చూసిన ఈ సినిమా టీజర్ నిన్న ఆదివారం రాత్రి విడుదలైంది. అయితే దీనికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.'ఆదిపురుష్' టీజర్ లో గ్రాఫిక్స్ మరియు వీఎఫ్ఎక్స్ వర్క్ పనితనంపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ సైతం డిజప్పాయింట్ అయినట్లు కామెంట్స్ పెడుతున్నారు. మోషన్ క్యాప్చర్ పద్ధతిలో తీస్తున్నామంటూ.. పేలవమైన యానిమేషన్ వర్క్ ని చూపించారనే విమర్శలు వస్తున్నాయి..

అలానే రావణుడిగా నటించిన సైఫ్ అలీఖాన్ గెటప్ మరియు శ్రీరాముడి పాత్రధారి ప్రభాస్ ఒళ్లంతా రుద్రాక్షలు ధరించి ఉండడం వంటి వాటిపైనా ఇప్పుడు నెట్టింట చర్చలు జరుగుతున్నాయి. మొత్తం మీద రామాయణం వంటి పౌరాణికాన్ని చెడ గొడుతున్నారనే విధంగా మాట్లాడుతున్నారు.

'రామాయణం' ను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ సరైన విధంగా హ్యాండిల్ చేయలేదని ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సోదరుడు రచయిత ఎస్ఎస్ కాంచి చేసిన ఓ ట్వీట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

'అమృతం' సీరియల్ తో నటుడిగా అలరించిన కాంచీ.. 'సై' వంటి పలు చిత్రాలతో మెప్పించారు. రాజమౌళి డైరెక్ట్ చేసే సినిమాలకు తనవంతు భాగస్వామ్యం అందిస్తుంటారు. 'మర్యాద రామన్న' వంటి సూపర్ చిత్రానికి కథ అందించిన సంగతి తెలిసిందే. స్వతహాగా హ్యూమరస్ గా మాట్లాడే కాంచి.. వెటకారనికి ప్రసిద్ధి చెందాడు.

ఆయితే లేటెస్టుగా "పౌరాణికం తీస్తే తెలుగోడే తీయాలి" అని కాంచి ఓ ట్వీట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. 'ఆదిపురుష్' టీజర్ వచ్చిన కొన్ని గంటల తర్వాత కంచి ఈ ట్వీట్ చేయడంతో.. పరోక్షంగా ఈ సినిమాని లక్ష్యంగా చేసుకునే ఈ కామెంట్స్ చేసారని నెటిజన్లు భావిస్తున్నారు.

బాలీవుడ్ ఫిలిం మేకర్ ఓం రౌత్ రామాయణాన్ని 'ఆది పురుష్' గా తెరకెక్కించడంలో విఫలమయ్యారనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. కాంచి ఇలాంటి ట్వీట్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీజర్ మరియు ప్రభాస్ లుక్ లను సమర్థిస్తున్న అభిమానులలో కొందరిని ఈ ట్వీట్ బాధించింది.

రాజమౌళి సోదరుడు 'ఆదిపురుష్' చిత్రాన్ని అనవసరంగా టార్గెట్ చేస్తున్నాడని.. టీజర్ చూసిన వెంటనే విషం ఎందుకు చిమ్ముతున్నారు? అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. మహాభారతం - రామాయణం సీరియల్స్ ను కొన్నేళ్ల క్రితమే భారతదేశం మొత్తం మళ్లీ మళ్లీ చూసేలా హిందీవాళ్ళు తీశారు కదా అని మరో నెటిజన్ అభిప్రాయ పడ్డాడు.

అయితే కాంచి మాత్రం తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. వేరే వాళ్ళు తీస్తే చూడరని చూడలేదని అనే అర్ధం నా ప్రకటనలో లేదు కదా అని అంటున్నారు. అంతకు కొన్ని నిమిషాల ముందు "భశుం".. ఇంత కంగాళీ సినిమా నా జన్మ లో చూడలేదు.. అప్పుడెప్పుడో చదివిన బాపూ గారి కార్టూను' అని మరో ట్వీట్ చేశారు కాంచి.

ఇది మణిరత్నం తెరకెక్కించిన 'పొన్నియన్ సెల్వన్ 1' సినిమా గురించేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలా రాజమౌళి సోదరుడు 'ఆది పురుష్' 'పీఎస్' సినిమాలపై వ్యగ్యంగా ట్వీట్లు పెట్టారని నెటిజన్లు భావిస్తున్నారు కానీ.. అవి కాంచి చేసినవేనా అని సందేహించే వారు కూడా లేకపోలేదు.

వెరిపైడ్ అకౌంట్ నుంచి రాలేదు కాబట్టి.. ఒరిజినల్ అవునో కాదో తెలియాల్సి ఉంది. సెలబ్రిటీ ఖాతా కాకపోతే 25K పైగా ఫాలోవర్స్ ఉండేవారు కాదు అని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా తెలుగు వాళ్ళని పొగుడుతో కాంచి వేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.