'అఖండ' పై అంచనాలు పెంచేసిన శ్రీకాంత్..!

Fri Jun 18 2021 19:00:01 GMT+0530 (IST)

Srikanth raises expectations on Akhanda

నటసింహ నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''అఖండ''. 'సింహా' 'లెజెండ్' తర్వాత సినిమాల వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ చిత్రంలో బాలయ్య ఫ్యాక్షనిస్ట్ గా అఘోరాగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ నటుడు శ్రీకాంత్ ఇందులో మెయిన్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీకాంత్ 'అఖండ' చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు.'అఖండ' చిత్రంలో తన పాత్రను హీరో బాలయ్య రోల్ కు ధీటుగా ఉండేలా బోయపాటి శ్రీను డిజైన్ చేసారని.. విలన్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటే హీరో క్యారక్టరైజేషన్ అంత ఎలివేట్ అవుతుందని ఆయన నమ్ముతారని శ్రీకాంత్ చెప్పారు. ఇందులో బాలయ్య చేస్తున్న రెండు పాత్రలతో తనకు సీన్స్ ఉంటాయని.. ఇటీవల రివీల్ చేసిన అఘోరా పాత్రతో ఎక్కువ సన్నివేశాలు ఉన్నాయని అన్నారు. బాలయ్య చేస్తున్న రోల్ అఘోరా అని కూడా అనలేమని.. డివైన్ కు సంబంధించిన వ్యక్తిగా ఆయన్ని చూపించారని.. అది ఎవరూ ఊహించని బ్యూటిఫుల్ క్యారక్టర్ అని శ్రీకాంత్ అన్నారు.

ఇందులో తాను వరదరాజులు అనే ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నానని.. గెటప్ మరియు పాత్ర తీరుతెన్నులు కొత్తగా ఉంటాయని శ్రీకాంత్ తెలిపారు. అంతేకాదు ఇన్నాళ్లూ తనని అభిమానించిన మహిళా ప్రేక్షకులు ఈ సినిమా చూసిన తర్వాత తిట్టుకునే ఛాన్సెస్ ఉంటాయని అన్నారు. బాలకృష్ణ కు తనకు మధ్య వచ్చే సన్నివేశాలలో ఇద్దరి డైలాగ్స్ బాగుంటాయని.. బాలయ్య చెప్పే డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. దీనితో నందమూరి అభిమానుల్లో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి.

కాగా 'అఖండ' చిత్రంతో జగపతిబాబు - పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్. ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు - తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.