Begin typing your search above and press return to search.

`స్పైడ‌ర్ మేన్` భాగ‌స్వాముల గొడ‌వేంటి?

By:  Tupaki Desk   |   22 Aug 2019 1:30 AM GMT
`స్పైడ‌ర్ మేన్` భాగ‌స్వాముల గొడ‌వేంటి?
X
స్పైడ‌ర్ మేన్ సిరీస్ సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బిలియ‌న్ డాల‌ర్ వ‌సూళ్ల‌తో ఈ సిరీస్ లో ఇప్ప‌టికే ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్లు తెర‌కెక్కాయి. మార్వ‌ల్ సినిమాటిక్స్ లోని డిస్నీ సంస్థ‌తో సోని పిక్చ‌ర్స్ భాగ‌స్వామ్యంలో ఇటీవ‌ల వ‌రుస‌గా 6 సినిమాలు వ‌చ్చాయి. ఇవ‌న్నీ బిలియ‌న్ డాల‌ర్ వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నం సృష్టించాయి. స్పైడ‌ర్ మేన్ ఫ్రాంఛైజీలో ఇప్ప‌టివ‌ర‌కూ వ‌చ్చిన సినిమాల‌న్నీ సుమారు 20 బిలియ‌న్ డాల‌ర్ వ‌సూళ్ల‌ను సాధించాయి. ఇందులో డిస్నీ-సోని కాంబినేష‌న్ సినిమాలు 8 బిలియ‌న్ డాల‌ర్ల‌ను కొల్ల‌గొట్టాయి. అయితే ఇంత‌టి సంచ‌ల‌నాల‌కు కార‌ణ‌మైన ఈ భాగ‌స్వామ్యం ఇక విడిపోనుంద‌ని తెలుస్తోంది.

ఆ రెండు సంస్థ‌ల మ‌ధ్యా విభేధాలు వ‌చ్చాయి. అందుకే ఇక‌పై స్పైడ‌ర్ మేన్ సినిమాల్ని క‌లిసి నిర్మించ‌డం కుద‌ర‌ద‌ని తెలుస్తోంది. మునుముందు ఈ సిరీస్ లో తెర‌కెక్కించే సినిమాల విష‌యంలో డిస్నీ త‌మ భాగ‌స్వామ్య విలువ‌ను పెంచాల్సిందిగా సోనీని కోరింది. అయితే సోని సంస్థ అందుకు నిరాక‌రించ‌డంతో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా భాగ‌స్వామ్యంలో కుదుపు త‌ప్ప‌లేద‌ని తెలుస్తోంది. దీని వ‌ల్ల సోని కంటే డిస్నీ సంస్థ‌కే ఎక్కువ న‌ష్టం అన్న విశ్లేష‌ణ సాగుతోంది. స్పైడ‌ర్ మేన్ క్యారెక్ట‌ర్ - కామిక్ బుక్స్ రైట్స్ సోనికి మాత్ర‌మే సొంతం. ఈ ఫ్రాంఛైజీలో సినిమాలు తీసే హ‌క్కు త‌న‌కు మాత్ర‌మే ఉంది. అయితే డిస్నీ(మార్వ‌ల్) త‌న వాటాను పెంచుకోవ‌డం ద్వారా ఎక్కువ లాభాల్ని ఆశిస్తోంది. అందుకే ఈ భాగ‌స్వామ్యం విడిపోయింద‌ని తెలుస్తోంది.

అయితే స్పైడ‌ర్ మేన్ సిరీస్ అభిమానుల‌కు ఇది చేదువార్త లాంటిది. రెండు దిగ్గ‌జాల్లాంటి సంస్థ‌ల క‌ల‌యిక వ‌ల్ల‌నే అద్భుతమైన నాణ్య‌మైన విజువ‌ల్స్ సాధ్య‌మ‌య్యాయి ఇంత‌కాలం. ఇక మీద‌ట ఆ స్థాయిని నిల‌బెట్టుకోవాలంటే సోని పిక్చ‌ర్స్ కొత్త భాగ‌స్వాముల్ని వెతుక్కోవాల్సి ఉంటుంద‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. స్పైడ‌ర్ మేన్ సిరీస్ లో టామ్ హోలాండ్ క‌థానాయ‌కుడిగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.