Begin typing your search above and press return to search.

స్పెషల్ పోస్టర్: సత్యభామకు 'బంగార్రాజు' బర్త్ డే విషెస్..!

By:  Tupaki Desk   |   15 Sep 2021 4:30 PM GMT
స్పెషల్ పోస్టర్: సత్యభామకు బంగార్రాజు బర్త్ డే విషెస్..!
X
టాలీవుడ్ లో కింగ్ అక్కినేని నాగార్జున- రమ్యకృష్ణ జోడీకి మంచి క్రేజ్ ఉంది. 'సంకీర్తన' సినిమాతో ప్రారంభమైన వీరిద్దరి కెమిస్ట్రీని నిన్నమొన్నటి 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా వరకు ప్రేక్షకులు స్వాగతించారు. ఇందులో బంగార్రాజుగా నాగ్.. సత్యభామగా రమ్యకృష్ణ చేసిన సందడి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టేలా చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ''బంగార్రాజు'' చిత్రంలో కూడా నాగార్జున - రమ్యకృష్ణ జోడీ అలరించబోతోంది.

ఇటీవలే ప్రారంభమైన ''బంగార్రాజు'' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే నేడు (సెప్టెంబర్ 15) రమ్యకృష్ణ 51వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా 'మా సత్యభామకు పుట్టినరోజు శుభాకాంక్షలు' అంటూ చిత్ర బృందం ఓ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఇందులో సత్యభామ పింక్ శారీలో చిరునవ్వులు చిందిస్తూ ఉండగా.. పంచెకట్టులో ఉన్న బంగార్రాజు ఆమె వెనుకనే డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నాడు. ఈ స్టిల్ సినిమాలో పాట సందర్భంలోనిదిగా తెలుస్తోంది. 'సోగ్గాడే చిన్నినాయనా' తరహాలో ఈ చిత్రంలో కూడా నాగార్జున - రమ్యకృష్ణ జోడీ మరోసారి అలరించబోతున్నారని అర్థం అవుతోంది.

కాగా, ''బంగార్రాజు'' చిత్రంలో తండ్రీకొడుకులు నాగార్జున - నాగచైతన్య కలిసి నటిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి వహిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. రొమాన్స్ - ఎమోషన్స్ కలబోసిన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఇందులో చైతన్య సరసన యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. చలపతి రావు - రావు రమేష్ - బ్రహ్మాజీ - వెన్నెల కిషోర్ - ఝాన్సీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. 'మనం' వంటి కల్ట్ క్లాసిక్ తర్వాత తండ్రీకొడుకుల ద్వయం నాగ్ - నాగచైతన్య కలిసి నటిస్తున్న ''బంగార్రాజు'' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.