బాలయ్య ఫ్యాన్స్ పండుగ చేసుకోవచ్చు... ?

Sun Oct 24 2021 21:00:01 GMT+0530 (IST)

Special Treat To Balayya Fans

నందమూరి బాలక్రిష్ణ టాలీవుడ్ సీనియర్ హీరో. ఆయన తన తండ్రి విశ్వవిఖ్యాత సార్వభౌమ ఎన్టీయర్ నట వారసుడిగా తెరంగేట్రం చేశారు. బాలయ్య పద్నాలుగేళ్ళ వయసులో తాతమ్మ కల సినిమాతో ముఖానికి మేకప్ వేసుకున్నారు. ఆ సినిమాలో ఎన్టీయార్ భానుమతి సహా పలువురి  ఉద్ధండుల పక్కన నటించి శభాష్ అనిపించుకున్నారు. ఆ మూవీ వంద రోజుల పండుగ వేడుకలకు హాజరైన అక్కినేని నాగేశ్వరరావు సింహం కడుపున సింహమే పుడుతుంది అని బాలయ్యని ఉద్దేశించి కితాబు ఇచ్చారు. బాలయ్య అది లగాయితీ ఈ రోజు వరకూ నటిస్తూనే ఉన్నారు. ఆయన తన తండ్రి ఎన్టీయార్ తో పదకొండు సినిమాలు నటించి అరుదైన రికార్డుని నెలకొల్పారు. ఇక వంద సినిమాలు చేసిన బాలయ్య ఈ తరంలో జానపద పౌరాణిక చారిత్రాత్మక మూవీస్ చేసిన ఏకైక హీరోగా కూడా తన పేరే నమోదు చేసుకున్నారు.లేటెస్ట్ గా చూస్తే  బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ మూవీ అఖండ రిలీజ్ కి రెడీగా ఉంది. సింహా లెజెండ్ మూవీస్ తరువాత వస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ తరువాత నాలుగైదు క్రేజీ  ప్రాజెక్టులను చేస్తున్న బాలయ్య ఫుల్ బిజీ అని చెప్పాలి. మరి బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రం ఎపుడు అన్నదే అభిమానుల ప్రశ్న. బాలయ్య పద్నాలుగేళ్ల వయసులోనే ఎంట్రీ ఇస్తే 27 ఏళ్ళ వయసున్నా కూడా మోక్షజ్ఞ ఇంకా హీరో కాకపోవడం ఏంటి అని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్య అయితే త్వరలో విడుదల అని చెబుతూ వస్తున్నా ఆ ముచ్చట అయితే ఈ రోజుకీ లేదు అని ఫ్యాన్స్ నిర్వేదంలో ఉన్నారు. అయితే బాలయ్య తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారని ప్రచారం సాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 2022లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండాలని డిసైడ్ చేశారుట. దాని కోసం డైరెక్టర్ ని కూడా సెలెక్ట్ చేశారని చెబుతున్నారు. ఆయన ఎవరో కాదు తనతో మూవీ తీయాలని తెగ ఆశపడుతున్న అనిల్ రావిపూడి అంటున్నారు. అనిల్ రావిపూడికి ఇప్పటిదాకా ఫ్లాప్ ముద్ర  లేదు. పైగా బాక్సాఫీస్ ని ఎలా అటాక్ చేయాలో తెలిసిన గడసరి డైరెక్టర్. అయితే అనిల్ రావిపూడి తండ్రి బాలయ్యతో మూవీ చేసి కొడుకు మోక్షజ్ఞ వద్దకు వస్తాడా లేక కొడుకుతోనే డైరెక్ట్ గా  మూవీ చేస్తారా అన్నదే చర్చగా ఉంది. వినవస్తున్న సమాచారం ప్రకారం అయితే తనతో కంటే తన కొడుకుతోనే అనిల్ రావిపూడి ఫస్ట్  సినిమా చేయాలని బాలయ్య పట్టుపడుతున్నట్లుగా తెలుస్తోంది. అదే నిజం అయితే బాలయ్య ఫ్యాన్స్ పండుగ చేసుకోవచ్చు అంటున్నారు.