Begin typing your search above and press return to search.

టాలీవుడ్ సూపర్ హిట్ కాంబో.. 'వెంకటేష్ - రాఘవేంద్రరావు'

By:  Tupaki Desk   |   18 May 2021 5:30 PM GMT
టాలీవుడ్ సూపర్ హిట్ కాంబో.. వెంకటేష్ - రాఘవేంద్రరావు
X
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు టాలీవుడ్ సీనియర్ హీరోలందరితో సక్సెస్ ఫుల్ సినిమాలు చేశారు. అందులో విక్టరీ వెంకటేష్ - రాఘవేంద్రరావు కాంబినేషన్‌ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు ఎనిమిది సినిమాలకు పనిచేసి వెండితెరపై సూపర్ హిట్ కాంబినేషన్ అనిపించుకున్నారు. వీరి కాంబోలో వచ్చిన సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

''కలియుగ పాండవులు'' సినిమాతో రాఘవేంద్రరావు - వెంకటేష్ కాంబినేషన్ ప్రారంభమైంది. ఈ సినిమాతో వెంకీని హీరోగా లాంచ్ చేశాడు దర్శకేంద్రుడు. ఇందులో ఖుష్బూ హీరోగా నటించింది. ఫస్ట్ సినిమాతోనే మంచి సక్సెస్ సాధించిన వెంకటేష్ బెస్ట్ యాక్టర్ గా స్పెషల్ జ్యూరీ నంది అవార్డ్ అందుకున్నాడు. 1986లో వచ్చిన ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందింది.

వెంకటేష్ - రాఘవేంద్ర రావు కాంబినేషన్‌ లో వచ్చిన రెండో చిత్రం ''భారతంలో అర్జునుడు''. వెంకీ - ఖుష్బూ జోడీని ఇందులో రిపీట్ చేశారు. ఇది హిందీలో సన్నీడియోల్ హీరోగా నటించిన ‘అర్జున్’ సినిమాకు తెలుగు రీమేక్. 1987లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌ గా నిలిచింది. ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావు తండ్రి కేఎస్ ప్రకాష్ రావు నిర్మించారు.

సూపర్ హిట్ కాంబోలో వచ్చిన మూడో చిత్రం ''ఒంటరి పోరాటం''. 1989లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. వెంకీ కెరీర్ కు అప్పట్లో ఈ మూవీ బాగా ప్లస్ అయిందని చెప్పవచ్చు. రాఘవేంద్రరావు - వెంకటేష్ కలయికలో వచ్చిన నాల్గవ చిత్రం ''కూలీ నెం.1" (1991). సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతోనే టబు హీరోయిన్ గా పరిచయమైంది.

వెంకటేష్ - రాఘవేంద్రరావు కలిసి చేసిన ఐదో చిత్రం ''సుందరకాండ"(1992). ఇది 'సుందరకాండం' అనే కొంత తమిళ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది. అప్పటి వరకు వీరి కాంబోలో వచ్చిన చిత్రాలకు భిన్నంగా ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. వీరి కాంబినేషన్లో రూపొందిన ఆరో చిత్రం 'ముద్దుల ప్రియుడు'. 1994లో వచ్చిన ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు - విక్టరీ వెంకటేష్ కలయికలో వచ్చిన ఏడో చిత్రం ''సాహసవీరుడు సాగరకన్య''(1996). ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే అందుకుంది. ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన ఎనిమిదో చిత్రం, చివరి చిత్రం ''సుభాష్ చంద్రబోస్''. ఇందులో వెంకటేష్ రెండు పాత్రల్లో కనిపించారు. 2005లో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌ గా నిలిచింది.

ఇలా వెంకటేష్ - రాఘవేంద్రావు కలిసి 8 సినిమాలు చేయగా.. అందులో 6 సూపర్ హిట్‌ గా నిలిచి వీరిని టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరో - డైరెక్టర్ కాంబినేషన్ గా నిలబెట్టాయి.