Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న టాలీవుడ్ సెకండ్ గ్రేడ్ హీరోలు..!

By:  Tupaki Desk   |   17 April 2021 2:30 PM GMT
బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న టాలీవుడ్ సెకండ్ గ్రేడ్ హీరోలు..!
X
టాలీవుడ్ హీరోలు అందరూ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో తమ మార్కెట్ ని విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు ప్రేక్ష‌కుల‌కే పరిమితం కాకుండా, ఇత‌ర భాష‌ల్లోనూ తమ సినిమాలను రిలీజ్ చేస్తూ పాపులారిటీ పెంచుకుంటున్నారు. ఓవర్ సీస్ లో కూడా దుమ్ముదులిపే కలెక్షన్స్ రాబడుతూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలు పది మంది దాకా ఉన్నారు. చిరంజీవి - నాగార్జున - బాలకృష్ణ - వెంకటేష్ - మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ - ప్రభాస్ - ఎన్టీఆర్ - రామ్ చరణ్ - అల్లు అర్జున్ వంటి హీరోల సినిమాలు రిజల్ట్ తో సంబంధం లేకుండా వసూళ్లు రాబడుతుంటాయి. అయితే ఇప్పుడు వీళ్ళను అనుసరిస్తూ వస్తున్న సెకండ్ గ్రేడ్ హీరోల మార్కెట్ ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం!

మాస్ మహారాజా రవితేజ: ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే రవితేజ.. ఒకప్పుడు టాప్ లీగ్ లో చేరినప్పటికీ సరైన సక్సెస్ లేక కాస్త వెనుకబడిపోయాడు. దీంతో 20-25 కోట్లకు పడిపోయిన ఆయన మార్కెట్.. బ్లాక్ బస్టర్ 'క్రాక్' సినిమాతో 40 కోట్ల దాకా వసూలు చేసి సత్తా చాటాడు. ప్రస్తుతం 'ఖిలాడి' సినిమాతో పాటు కొత్త దర్శకుడితో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.

నేచురల్ స్టార్ నాని: సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరైన నాని.. మార్కెట్ పరంగా సెకండ్ గ్రేడ్ హీరోల్లో టాప్‌ లో ఉన్నాడు. నిర్మాతల హీరో అయిన ఈయన మార్కెట్ 30 కోట్లపైనే ఉంది. అయితే గత రెండు సినిమాలు ప్లాప్ అవడంతో కాస్త డీలా పడ్డాడు. ఇప్పటికే 'టక్ జగదీష్' చిత్రాన్ని రిలీజ్ కి రెడీ చేసిన నాని.. 'శ్యామ్ సింగ రాయ్' షూటింగ్ చేసేస్తున్నాడు. ఇదే క్రమంలో 'అంటే.. సుందరానికీ!' సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలతో ఈయన మార్కెట్ మరింత విస్తరించే అవకాశం ఉంది.

విజయ్ దేవరకొండ: యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పచుకున్న విజయ్.. 'పెళ్లి చూపులు' 'అర్జున్ రెడ్డి' 'గీత గోవిందం' 'టాక్సీవాలా' వంటి సూపర్ హిట్స్ తో సెన్సేషనల్ స్టార్ గా మారిపోయాడు. ముఖ్యంగా 'గీత గోవిందం' సినిమాతో తన మార్కెట్ ని బాగా పెంచుకున్నాడు. అయితే 'వరల్డ్ ఫేమస్ లవర్' ప్లాప్ తో కాస్త స్లో అయ్యాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో చేస్తున్న 'లైగర్' సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు వీడీ. ఈ మూవీ సక్సెస్ అయితే విజయ్ మార్కెట్ ఓ రేంజ్ కి చేరే అవకాశాలున్నాయి.

నాగ చైతన్య: అక్కినేని వారసుడు యువసామ్రాట్ నాగచైతన్య 'మజిలీ' సినిమాతో 38 కోట్ల మార్క్ అందుకున్నాడు. వెంటనే 'వెంకీమామ' సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు. చైతూ మార్కెట్ ఇప్పుడు 30 కోట్ల పైనే ఉంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల తో 'లవ్ స్టోరీ' సినమాని విడుదలకు సిద్ధం చేసిన యువ హీరో.. ప్రస్తుతం విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత తన తండ్రి నాగార్జునతో కలిసి 'బంగార్రాజు' సినిమా చేయనున్నాడు.

రామ్ పోతినేని: ఎనర్జిటిక్ హీరో అనిపించుకున్న రామ్.. సినిమా సినిమాకి తన మార్కెట్ పెంచుకుంటూ వస్తున్నాడు. గతేడాది 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని బాక్సాఫీస్ వద్ద 35 కోట్ల మార్క్ రీచ్ అయ్యాడు. 'రెడ్' సినిమాతో పర్వాలేదనిపించిన రామ్.. ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ఓ బైలింగ్వల్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు.

వరుణ్ తేజ్: మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో ఇండస్ట్రీకి వచ్చిన వరుణ్.. 'ఫిదా' 'తొలిప్రేమ' 'గద్దలకొండ గణేష్' 'ఎఫ్ 2' సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈయన మార్కెట్ 30 కోట్లు దాటింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ 'గని' సినిమాతో పాటుగా 'ఎఫ్ 3' సినిమాలతో రాబోతున్నాడు.

సాయి తేజ్: మెగా మేనల్లుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన సాయి తేజ్.. 'చిత్రలహరి' సినిమాతో ట్రాక్ లోకి వచ్చాడు. 'ప్రతీరోజూ పండగే' చిత్రంతో తన మార్కెట్ రేంజ్ 32 కోట్లకు పెంచుకున్నాడు. 'సోలో బ్రతుకే సో బెటర్' తో పర్లేదనిపించిన సాయి తేజ్.. ఇప్పుడు 'రిపబ్లిక్' సినిమాతో వస్తున్నాడు.

నితిన్: 'భీష్మ' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ హీరో 30 కోట్ల మార్కెట్ కు దగ్గరగా చేరుకున్నాడు. 'చెక్' సినిమాతో నిరాశ పరిచినా మళ్ళీ 'రంగ్ దే' మూవీతో ట్రాక్ లోకి వచ్చాడు. ఇప్పుడు 'మాస్ట్రో' సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడానికి వస్తున్నాడు.

అఖిల్: అక్కినేని హ్యాండ్సమ్ హీరోకి ఇప్పటి వరకు సరైన హిట్ పడలేదు. కానీ ఫస్ట్ సినిమా ప్లాప్ అయినా అఖిల్ తొలిరోజే 10 కోట్ల షేర్ రాబట్టి తన స్టామినా ఏంటో చూపించాడు. సాలిడ్ హిట్ పడితే కచ్చితంగా 20 కోట్ల వరకు అఖిల్ మార్కెట్ పెరగడం ఖాయమని చెప్పవచ్చు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాని విడుదలకు సిద్ధం చేస్తున్న అఖిల్.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' సినిమా చేస్తున్నాడు.

రానా: దగ్గుబాటి వారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన రానా.. విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. 'బాహుబలి' సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న రానా.. పాన్ ఇండియా సినిమాలతో మార్కెట్ పెంచుకున్నాడు. ఇటీవల 'అరణ్య' సినిమాతో ప్రశంసలు అందుకున్న రానా.. 'విరాటపర్వం' అనే మరో వైవిధ్యమైన సినిమాతో వస్తున్నాడు.

శర్వానంద్: వర్సటైల్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శర్వా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్య రేసులో కాస్త వెనుకబడిన యువ హీరో.. రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ వస్తే మార్కెట్ ఓ రేంజ్ కి చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం 'మహాసముద్రం' 'ఆడాళ్లు మీకు జోహార్లు' వంటి సినిమాలతో నటిస్తున్నాడు. అలానే కొత్త దర్శకుడితో ఓ ద్విభాషా చిత్రం షూటింగ్ పూర్తి చేశాడు.

గోపీచంద్: మాస్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్న గోపిచంద్.. సరైన సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. ఒక్క విజయం వస్తే బాక్సాఫీస్ వద్ద ఆయన మార్కెట్ 15 కోట్లకు పైనే ఉండే అవకాశం ఉంది. 'సీటీమార్' సినిమాతో వస్తున్న గోపీచంద్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.