Begin typing your search above and press return to search.

మండే భాస్వరం.. మనమ్మాయే

By:  Tupaki Desk   |   18 Jan 2020 5:53 AM GMT
మండే భాస్వరం.. మనమ్మాయే
X
హిందీ సినిమాలు చూసే అలవాటు ఉన్న వారికి బాలీవుడ్ భామ స్వరభాస్కర్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. మిగిలిన హీరోయిన్లకు కాస్త భిన్నమైన ఈ భామ చేసే సినిమాలు ప్రత్యేకంగా ఉండటమే కాదు.. రోటీన్ కు కాస్త భిన్నంగా ఉంటాయి. ప్రజలు ఎదుర్కొనే సమస్యల్ని తన సినిమాలతో చూపించేందుకు దేనికైనా రెడీ అనే దమ్ము స్వర సొంతం.

తన మనసులో ఏమనుకుంటుందో ఎలాంటి మొహమాటం లేకుండా ముఖం పగిలిపోయేలా చెప్పే ధైర్యం ఆమెలో టన్నులు టన్నులు ఉంటుంది. తాను చెప్పిన మాటలు వివాదాస్పదమైతే.. అది తన తప్పేమీ కాదని.. తప్పుగా అర్థం చేసుకున్న వారిదని ఆమె తేల్చేస్తుంది. తెర మీద నటించేందుకు ఎలాంటి పాత్ర అయినా.. ఓకే చెప్పేయటమే కాదు.. మొహమాటానికి అస్సలు గురి కాదు.

ఇందుకు వీరి ది వెడ్డింగ్ చిత్రం ఒక పెద్ద ఎగ్జాంఫుల్ గా చెబుతారు. ఈ సినిమాలో స్వర భర్త విదేశాల్లో ఉంటాడు. ఒంటరిగా ఉండే భార్య పాత్రను పోషిస్తుంది. భర్తతో ఆమెకు గొడవలు ఉంటాయి. అలా అని భర్తను మోసం చేయాలని అనుకోదు. ఈ క్రమంలో ఒంటరి మహిళ జీవితంలోని ఫస్ట్రేషన్ చూపించే క్రమంలో తనను తాను తృప్తి పరుచుకునేందుకు రెఢీ అవుతుంది. దీనికి సంబంధించిన సీన్ చేసిన తొలి బాలీవుడ్ నటిగా స్వరను చెప్పొచ్చు. ఈ సన్నివేశంలో ఆమె నటన.. పాత్రలో జీవించినట్లుగా ఉండటం చూస్తే.. యాక్టింగ్ పట్ల ఆమెకున్న కమిట్ మెంట్ ఎలాంటిదో ఇట్టే అర్థమైపోతుంది.

ఈ పాత్ర మీద సంప్రదాయవాదులు గుర్రుమన్నా.. ఆమె లైట్ తీసుకుంటుంది. స్త్రీల గురించి. మనుషుల నిజమైన ప్రవర్తన గురించి తెలీని వారే ఇలాంటివి చేస్తారని తేల్చేస్తుంది. ఇంత నిర్మొహమాటంగా వ్యవహరించే ఆమె.. మిగిలిన బాలీవుడ్ సెలబ్రిటీలకు భిన్నం. మోడీ సర్కారు ఇటీవల తీసుకొచ్చిన సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా ముంబయిలోని అజాద్ మైదాన్ లో భారీ సభ జరిగితే.. అందరికంటే ముందుగా వెళ్లి పాల్గొన్నది కూడా స్వర భాస్కరే. అలా చేయటానికి ఆమె అస్సలు వెనుకాడరు.

బాలీవుడ్ లో ఈ రోజున స్వర భాస్కర్ ను విస్మరించలేరు. ఆమెకున్న గుర్తింపు ఆమెకు మాత్రమే సొంతం. ఇదంతా ఓకే.. ఇప్పుడు ఆమె గురించి ఎందుకు చెబుతున్నట్లు? అంటారా? అక్కడికే వస్తున్నాం. ఆమెకు సంబంధించిన ఆసక్తికర విషయం చాలామందికి తెలీదు. ఆమె మూలాల్లో తెలుగు ఉంది మరి. ఎందుకంటే.. ఆమె తండ్రి గురించి చాలామందికి తెలీదు. ఎందుకంటే.. ఆయన తెలుగు వ్యక్తి. పేరు.. చిత్రపు ఉదయభాస్కర్. కోరుకొండ స్కూల్లో చదువుకున్నాడు. ఆర్మీలోకి వెళ్లి.. తర్వాత నేవీలో పని చేశాడు. ఆయన బిహారీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆమె ఢిల్లీ జేఎన్ యూలో ప్రొఫెసర్ గా పని చేస్తుంటారు. మండే భాస్వరంలా ఉండే స్వర భాస్కర్ తెలుగు మూలాలు ఉండటం..ఆమె మనమ్మాయి అనుకోవటం తెలుగోళ్లకు అంతో ఇంతో హ్యాపీ పక్కా అని చెప్పక తప్పదు.