చిరూ 'గాడ్ ఫాదర్'లో సల్మాన్ పై సాంగ్ కూడా!

Thu Oct 14 2021 06:00:01 GMT+0530 (IST)

Song on Salman in Chiru Godfather

చిరంజీవి కథానాయకుడిగా ఇటీవల 'గాడ్ ఫాదర్' ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లింది. ఊటీలో ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తి చేసింది. చిరంజీవితో పాటు మురళీమోహన్ తదితరులు ఈ షూటింగులో పాల్గొన్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ సినిమాలో సల్మాన్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడనేది ఈ వార్త సారాంశం. అయితే ఈ వార్త నిజమేనని చెప్పినవారు లేరు .. అలాగని కొట్టిపారేసినవారూ లేరు. దాంతో సల్మాన్ ఈ సినిమాలో నటించడం ఖాయమేననే ప్రచారమే ఊపందుకుంటోంది.నిజానికి చిరు ఫ్యామిలీతో సల్మాన్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. చరణ్ కారణంగా వాళ్ల మధ్య స్నేహబంధం మరింత బలపడింది. అందువలన సల్మాన్ ఒప్పుకుని ఉంటాడని చాలామంది అనుకుంటున్నారు. అయితే ముందుగా పాత్ర నిడివి కాస్త తక్కువగానే ఉండేదట. సల్మాన్ చేస్తానని చెప్పడం వల్లనే ఆ పాత్ర నిడివిని పెంచుతున్నట్టుగా చెబుతున్నారు. అంతేకాదు సల్మాన్ పాత్రకి సంబంధించి ఒక పాటను కూడా సెట్ చేయాలని అంటున్నారట. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. అయితే అందుకు సంబంధించిన సమాచారంలో స్పష్టత రావలసి ఉంది.

ఇక 'గాడ్ ఫాదర్' అనేది మలయాళంలో మోహన్ లాల్ చేసిన 'లూసిఫర్' సినిమాకి రీమేక్. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019లో మలయాళంలో భారీ విజయాలను సాధించిన సినిమాల జాబితాలో ఒకటిగా నిలిచింది. మోహన్ లాల్ కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాల వరుసలో ఇది కనిపిస్తుంది. ఈ కథ .. పాత్రలు నచ్చడం వల్లనే చిరంజీవి రీమేక్ లో చేయడానికి ఉత్సాహాన్ని చూపించారు. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను తమిళ దర్శకుడైన మోహన్ రాజాకు అప్పగించారు. తెలుగు నేటివిటీకి తగిన విధంగా మార్పులు చేసిన ఆయన ఇటీవలే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు.

ఇక మరో విశేషం ఏమిటంటే సీనియర్ హీరోయిన్ శోభన ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. మలయాళంలో మంజువారీయర్ చేసిన పాత్రలో ఆమె కనిపించనున్నట్టు చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఆమె షూటింగులో జాయిన్ కానున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఇతర పాత్రలలో ఎవరెవరు నటించనున్నారనే విషయంలో త్వరలోనే స్పష్టత రానుంది. వేసవికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ దిశాగానే ప్రణాలికను సెట్ చేసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

ఇక చిరంజీవి తాజా చిత్రంగా 'ఆచార్య' రూపొందిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా కాజల్ అలరించనుంది. ముఖ్యమైన పాత్రలో చరణ్ నటించగా ఆయన జోడీగా పూజ హెగ్డే ఆడిపాడింది. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'భోళా శంకర్' .. బాబీ దర్శకత్వంలో 'వాల్తేర్ వీరయ్య' సినిమాలను చిరంజీవి చేయనున్నారు. వచ్చే ఏడాది ఈ రెండు సినిమాలు పట్టాలెక్కనున్నాయి. మొత్తానికి చిరంజీవి యంగ్ హీరోలతో పోటీపడుతూ దూసుకుపోతుండటం విశేషం.