విశ్వక్.. ఆకాశరామన్న మెయిల్ కథ!

Sun Feb 23 2020 15:57:50 GMT+0530 (IST)

Someone Close Plotted Against Vishwak Sen!

ఒక మనిషి కష్టపడి పైకి రావడానికి ప్రయత్నం చేస్తుంటే ఎంతమంది సహాయం చేస్తారో తెలియదు కానీ ఒక మనిషి నిజంగా పైకి వస్తుంటే మాత్రం చాలామంది కళ్ళు మండిపోతాయి.. కొందరికి కడుపులో మంట రేగుతుంది.  వారు వైఫై సిగ్నల్స్ తో.. తమ ఈగో రేడియేషన్ తో పాడు చేసేందుకు ప్రయత్నం చేస్తారు. కొందరేమో ఇలాంటి చూపులు.. గాల్లో ప్రయత్నాలతో ఆగకుండా కిందకు లాగేందుకు ప్రయత్నాలు చేస్తారు. అగ్రెసివ్ టాలీవుడ్ హీరో  విశ్వక్ సేన్ కు ఇలాంటివాడే కొన్నిరోజుల క్రితం ఒకడు తగులుకున్నాడట.తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఈ నగరానికి ఏమైంది' హీరోగా విశ్వక్ సేన్ కు మొదటి సినిమా.  ఈ సినిమా అవకాశం వచ్చిన సమయంలో ఒక అజ్ఞాతవాసి తరుణ్ కు విశ్వక్ గురించి మెయిల్ పంపారట. ఆ మెయిల్ లో కంటెంట్ ఏంటంటే.. "విశ్వక్ సేన్ ఒక అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు.. విశ్వక్ మంచివాడు కాదు. జాగ్రత్తగా ఉండండి".   తరుణ్ ఆ ఆకాశరామన్న మెయిల్ ను నమ్మడంతో విశ్వక్ ను సినిమా నుంచి తప్పించారట. అయితే విశ్వక్ ఊరుకోకుండా తనను ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలని తరుణ్ ను విసిగించడంతో సదరు ఆకాశరామన్న మెయిల్ ను విశ్వక్ కు ఫార్వర్డ్ చేశాడట.  ఆ మెయిల్ చూడగానే అదెవరి పనో విశ్వక్ అర్థం చేసుకుని తరుణ్ కు చెప్పాడట.  ఒక వ్యక్తి అమ్మాయిలా మెయిల్ పెట్టాడని తరుణ్ దగ్గర ప్రూవ్ చేశాడట. దీంతో 'ఈ నగరానికి ఏమైంది' అవకాశం వచ్చింది.  లేకపోతే విశ్వక్ ఆ సినిమాను మిస్ చేసుకునేవాడు.

ఇందుమూలంగా యావన్మందికీ తెలియజేయునది ఏమనగా మన చుట్టూ కొందరు ఆకాశరామన్నలు ఉంటారు. సదరు లంగూర్ గాళ్ళను గుర్తించకపోతే మీకు ఎప్పుడో ఎక్కడో చిరిగి చాట కావడం ఖాయం.  ఈ విషయం పక్కన పెట్టేస్తే విశ్వక్ నటించిన కొత్త సినిమా 'హిట్' వచ్చేవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.