'రాధేశ్యామ్' నుంచి హృదయాన్ని తాకే సోల్ ఫుల్ మెలోడీ..!

Wed Dec 08 2021 15:00:37 GMT+0530 (IST)

Soch Liya Video Song An Emotion Filled Heartbreak Song

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పుజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ''రాధేశ్యామ్''. రాధాకృష్ణ కుమార్ ఈ పీరియాడికల్ లవ్ డ్రామాకి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 14న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.'రాధేశ్యామ్' మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ప్రచార కార్యక్రమాల్లో నిన్న మొన్నటి వరకు కాస్త నిదానంగా ఉన్న చిత్ర బృందం.. ఒక్కసారిగా వేగంపెంచి సినిమాపై భారీ హైప్ తీసుకొస్తున్నారు. నాలుగు దక్షిణాది భాషలకు మరియు హిందీ వెర్సన్ కు వేర్వేరుగా ప్రమోషన్స్ చేస్తుండటం గమనార్హం.

హిందీ వెర్సన్ నుంచి 'వన్ హార్ట్ టూ హార్ట్ బీట్స్' పేరుతో ఇప్పటికే విడుదలైన 'ఆషికీ ఆ గయీ' సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో 'రాధే శ్యామ్' నుంచి ''సోచ్ లియా'' అనే మరో సాంగ్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఎమోషనల్ మూడ్ లో సాగిన ఈ పాట హృదయానికి హత్తుకుంటోంది.

ప్రేరణ ప్రేమ కోసం విక్రమాదిత్య వెంటపడటం.. ఆమె అతనికి దూరంగా వెళుతుండటం.. ప్రేమలో పడిన తర్వాత ఇద్దరూ దూరం అవ్వడం.. ఒకరి గురించి మరొకరు ఆలోచిస్తూ ఉండటం.. ఒకరి ప్రేమ కోసం ఒకరు తపిస్తూ ఉండటం వంటి సన్నివేశాలను 'సోచ్ లియా' పాటలో చూడొచ్చు.

వింటేజ్ లుక్ లో ప్రభాస్ - పూజాహెగ్డే జంట స్క్రీన్ మీద ఫ్రెష్ గా కనిపిస్తోంది. 1970 కాలానికి తగ్గట్టుగా ఉన్న లొకేషన్స్ - విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ బ్యూటిఫుల్ సోల్ ఫుల్ మెలోడీకి మిథున్ ట్యూన్ కంపోజ్ చేశారు. మనోజ్ మింతాసిర్ సాహిత్యం అందించగా.. అర్జిత్ సింగ్ అద్భుతంగా ఆలపించారు.

గుల్షన్ కుమార్ - టీ సిరీస్ సమర్పణలో యువీ క్రియేషన్స్ తో కలసి భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అందించారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేయగా.. రసూల్ పోకుట్టి సౌండ్ డిజైనింగ్ చేశారు. దక్షిణాది భాషలకు జస్టిస్ ప్రభాకర్ సంగీతం సమకూర్చారు.