సోగ్గాడి సంపాదన గుట్టు లీక్

Wed Aug 08 2018 12:57:38 GMT+0530 (IST)

టాలీవుడ్ లో అరడజను స్టార్ హీరోలు 20 నుంచి 30 కోట్ల మధ్య పారితోషికాలు అందుకుంటున్నారు. అయ్యబాబోయ్! అంత పారితోషికమే! బడ్జెట్ లో సగం ఇలానే ఖర్చయిపోతోంది! అంటూ ఒకటే కంగారు పడిపోయేవాళ్లు ఉన్నారు. అయితే పారితోషికాలు అనేవి ఇప్పుడే కాదు - నాటి రోజుల్లోనూ అంతే భారీగా ఉండేవి. హీరోల వెంట పడి నిర్మాతలు పోటాపోటీగా రెమ్యునరేషన్లు ముట్టజెప్పి కాంట్రాక్టులు కుదుర్చుకునేవారు. శోభన్ బాబు - కృష్ణ - చంద్రమోహన్ కాలంలోనే ఇలాంటివి ఉండేవి. అంత లేకపోతే సోగ్గాడు శోభన్ బాబు కోట్లాది రూపాయల ఆస్తుల్ని ఎలా కూడగట్టారు? అన్న డిబేట్ ఆల్ టైమ్ ఎందుకు ట్రెండింగ్ అవుతోంది?అప్పట్లో ఆర్టిస్టుల పారితోషికాలు చాలా తక్కువ అని భావించడానికి లేదు. కరెన్సీ విలువను బట్టి అప్పట్లోనూ అంతే భారీ పారితోషికాలు అందుకునేవారు స్టార్లు. దాదాపు 25-30 ఏళ్ల క్రితం శోభన్ బాబు - కృష్ణ వంటి హీరోలు లక్షల్లో పారితోషికం అందుకునేవారు. ఇప్పుడు కోట్లు ఎలానో - అప్పుడు లక్షలు అంతే! ఇప్పుడు కోట్లాది రూపాయలతో సినిమాలు నిర్మిస్తున్నారు. అప్పుడు లక్షల్లోనే సినిమాలు తెరకెక్కేవి. తమ డిమాండ్ కు తగ్గట్టే నాటి స్టార్లు లక్షల్లో పారితోషికాలు అందుకునేవారు.

డిమాండ్ ఉన్న స్టార్ హీరోలతో కమిట్ మెంట్ల కోసం నిర్మాతలు ఇప్పట్లానే అప్పుడు కూడా సూట్ కేసులు పట్టుకుని తిరిగేవారు. క్రేజు ఉన్న హీరోని బుక్ చేసి సినిమా తీసి డబ్బు సంపాదించాలని చూసేవారు. దాంతో హీరోలు తమకు ఉన్న డిమాండ్ ని ఎన్ క్యాష్ చేసుకునేవారు. పారితోషికాలు స్కైలోకి వెళుతుండడంతో అప్పట్లో మూవీ ఆర్టిస్టుల సంఘం ఓ రూల్ పెట్టింది. హీరోలు ఎవరూ 10లక్షలు మించి పారితోషికం తీసుకోకూడదు.. తీసుకుంటే ఇండస్ట్రీ నుంచి వెలేస్తాం! సహకరించము.. అన్నది ఆ రూల్. అయితే దీనిని అందాల హీరో - సోగ్గాడు శోభన్ బాబు తీవ్రంగా వ్యతిరేకించారు. రూ.10లక్షలేం కర్మ.. రూ.15లక్షలు ఇస్తామని నిర్మాతలు సూట్ కేసులు పట్టుకుని ఇంటి చుట్టూ తిరుగుతుంటే వద్దు పొమ్మంటామా? మీరెవరు చెప్పడానికి? అంటూ అసోసియేషన్ వాళ్లను శోభన్ బాబు తిట్టేశారట. ఆ దెబ్బతో అలా ఆ రూల్ బ్రేకయ్యిందని శోభన్ బాబుకు బట్టలు కుట్టే సీనియర్ సినీ టైలర్ ఒకాయన తెలిపారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ .. ఇలానే షాకిస్తుంది కదూ?