ఎలాంటి హడావుడి లేకుండా వస్తోన్న చిన్న మీడియం రేంజ్ సినిమాలు..!

Thu May 26 2022 22:00:01 GMT+0530 (IST)

Small medium range movies coming In Tollywood

కరోనా పాండమిక్ తర్వాత టాలీవుడ్ లో ఎప్పటిలాగే ప్రతీ శుక్రవారం సరికొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 'బంగార్రాజు' 'భీమ్లా నాయక్' 'రాధే శ్యామ్' 'RRR' 'KGF 2' 'బీస్ట్' 'ఆచార్య' 'సర్కారు వారి పాట' వంటి పలు క్రేజీ సినిమాలు వచ్చాయి. వాటిలో చాలా వరకు సక్సెస్ అవ్వగా.. కొన్ని డిజాస్టర్లుగా నిలిచాయి. 'డీజే టిల్లు' వంటి చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.ఈ వారం వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటించిన ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఎఫ్ 3' రిలీజ్ తో మే నెల ముగియబోతోంది. రాబోయే జూన్ మరియు జూలై నెలల్లో కూడా అనేక సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. స్టార్ హీరోలంతా ఆగస్ట్ నుంచి బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయడానికి సిద్ధమవుతుండగా.. ఈ రెండు నెలల్లో చిన్న మీడియం రేంజ్ సినిమాలు విడుదల కాబోతున్నాయి.

సాదరంగా జూన్ మరియు జూలై నెలలను సినిమాలకు కొంత డ్రై సీజన్ గా పరిగణిస్తుంటారు. వేసవి సెలవులు ముగించుకొని స్కూల్స్ - కాలేజీలు రీ-ఓపెన్ అవుతుంటాయి కాబట్టి.. స్టార్ హీరోల సినిమాలను ఈ నెలల్లో రిలీజ్ చేయడానికి వెనకడుతుంటారు. అయితే పాండమిక్ తర్వాత అకడమిక్ ఇయర్ లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు జనాలను థియేటర్లకు నడిపిస్తాయని ఆశించవచ్చు.

అడివి శేష్ టైటిల్ రోల్ లో నటించిన ''మేజర్'' బయోపిక్ తెలుగు హిందీ మలయాళ భాషల్లో జూన్ 3న విడుదల చేయబోతున్నారు. అదే రోజున కమల్ హాసన్ నటించిన గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా 'విక్రమ్' పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. అక్షయ్ కుమార్ పీరియాడికల్ డ్రామా 'పృథ్వీరాజ్' కూడా వీటికి పోటీగా తెలుగులోకి వస్తోంది.

జూన్ 10న నాని 'అంటే సుందరానికి' వంటి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. అదే రోజు రక్షిత్ శెట్టి హీరోగా చేసిన '777 చార్లీ' అనే కన్నడ డబ్బింగ్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. జూన్ 17న ప్లాన్ చేసిన రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా వాయిదా పడటంతో.. ఆ తేదీని సత్యదేవ్ 'గాడ్సే' సినిమా క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. జూన్ 24న కిరణ్ అబ్బవరం నటించిన 'సమ్మతమే' సినిమా రిలీజ్ కానుంది.

జూలై 1వ తేదీన గోపీచంద్ - మారుతీల 'పక్కా కమర్షియల్' సినిమా థియేటర్లలోకి రాబోతోంది. అదే రోజు రానా దగ్గుబాటి - సాయి పల్లవిల 'విరాట పర్వం'.. పంజా వైష్ణవ్ తేజ్ - కేతిక శర్మల 'రంగ రంగ వైభవంగా' చిత్రాలు విడుదల కాబోతున్నాయి. జూలై 8వ తేదీన నాగ చైతన్య - విక్రమ్ కె కుమార్ కాంబోలో తెరకెక్కిన 'థ్యాంక్యూ' సినిమా ప్రేక్షకులను పలకరించబోతోంది.

రామ్ పోతినేని - లింగుస్వామి కలయికలో వస్తోన్న ద్విభాషా చిత్రం 'ది వారియర్' ను జూలై 14న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. నిఖిల్ సిద్దార్థ్ - చందు మొండేటీల 'కార్తికేయ 2' సినిమా జూలై 22న రానుంది. అడివి శేష్ నటిస్తోన్న 'హిట్ 2' సినిమాని జూలై 29న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇటీవల భారీ అంచనాలతో విడుదలైన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో జూన్ - జులై లో ప్లాన్ చేసిన సినిమాలు ఎలాంటి హడావుడి లేకుండా వస్తున్నాయి. మరి వీటిల్లో ఏవేవి ఆడియన్స్ ను అలరించి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడతాయో చూడాలి.