టాలీవుడ్: ఆరేడు సినీ కుటుంబాల ఆధిపత్యమే!

Thu Nov 21 2019 20:00:01 GMT+0530 (IST)

Six Families Dominate In Telugu Film Industry

టాలీవుడ్ లో వారసుల హంగామా తారాస్థాయిలో ఉంటుంది.  పేరున్న సినీ కుటుంబాల నుండి వచ్చిన వారే ఇప్పుడు తెలుగు చిత్రసీమను ఏలుతున్నారు.  ఈ జెనరేషన్ టాప్ లీగ్ హీరోలలో ఒక్కరు కూడా నేపథ్యం లేనివారు లేరు.  మహేష్ బాబు.. రామ్ చరణ్.. ఎన్టీఆర్.. ప్రభాస్.. అల్లు అర్జున్..  ఇలా టాప్ హీరోలు అందరూ పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారే. ఇక టాప్ హీరోలు అనే కాదు.. సినీ కుటుంబాల విషయమే తీసుకుంటే టాలీవుడ్ న ఒక ఆరేడు ఫ్యామిలీల వారే ఏలుతున్నారు. ఒక్కసారి వారిపై దృష్టి సారిద్దాం.మెగా కుటుంబం: మొత్తం పదిమంది హీరోలు.. ఒక హీరోయిన్.  చిరంజీవి.. పవన్ కళ్యాణ్.. అల్లు అర్జున్.. రామ్ చరణ్.. సాయి ధరమ్ తేజ్.. వరుణ్ తేజ్.. అల్లు శిరీష్.. కళ్యాణ్ దేవ్.. నాగబాబు(అప్పట్లో హీరోగా పలు సినిమాల్లో నటించారు).. పంజా వైష్ణవ్ తేజ్(డెబ్యూ సినిమా షూటింగ్ జరుగుతోంది).  నిహారిక కొణిదెల కూడా హీరోయిన్ గా పలు సినిమాలలో నటించింది.

అక్కినేని కుటుంబం: అక్కినేని నాగార్జున.. సుమంత్.. నాగచైతన్య.. అఖిల్.. సుశాంత్.  సమంతా ఇప్పుడు అక్కినేని కుటుంబ సభ్యురాలే.

నందమూరి కుటుంబం: నందమూరి బాలకృష్ణ.. జూనియర్ ఎన్టీఆర్.. నందమూరి కళ్యాణ్ రామ్.. తారక రత్న.. నారా రోహిత్.

ఘట్టమనేని కుటుంబం: మహేష్ బాబు.. సుధీర్ బాబు.. సీనియర్ నరేష్.. నవీన్ విజయ్ కృష్ణ.. అశోక్ గల్లా(డెబ్యూ సినిమా షూటింగ్ లో ఉంది).

దగ్గుబాటి కుటుంబం:  వెంకటేష్.. రానా దగ్గుబాటి.

మంచు కుటుంబం: మోహన్ బాబు.. విష్ణు.. మనోజ్.. మంచు లక్ష్మి.

ఈ కుటుంబాలలో జస్ట్ హీరోలే కాకుండా నిర్మాతలు కూడా చాలామంది ఉన్నారు. ఈ ఫ్యామిలీలను దాటి ఏవైనా అవకాశాలు వస్తే కదా .. అసలు కథలు అయినా ఈ కుటుంబాలను దాటి ఇతరుల చెంతకు వస్తేనే కదా.  ఇలాంటి కుటుంబ హీరోలతో చేయడంలో దర్శకులకు  ఎప్పుడూ ఒక ఎడ్వాంటేజ్ ఉంటుంది.  అదేంటంటే కుటుంబంలో ఒక హీరోకు హిట్ ఇస్తే వారికి దాదాపుగా మరో మూడు నాలుగు సినిమాలకు మార్గం సుగమం అవుతుంది.  అందుకే చాలామంది దర్శకులు ఈ కుటుంబాల వారితో సినిమాలు చేసేందుకు మొగ్గుచూపిస్తున్నారు.  టాలీవుడ్ లో కంగనా లేదు కానీ ఒకవేళ కంగనా తెలుగు హీరోయిన్ అయి ఉంటే ఈ కుటుంబాల ఆధిపత్యం.. నెపోటిజం పైన దిక్కులు పిక్కటిల్లేలా కెవ్వు కెవ్వున కేకలు పెట్టి ఉండేది. 

నిజంగా అలోచించి చూస్తే ఇన్ని కుటుంబాల హీరోల మధ్యలో బ్యాకప్ లేకుండా ఒక కొత్త హీరో రావడం.. నిలదొక్కుకోవడం జరిగే పనేనా? అలా నిలదొక్కుకున్న మొండి ఘటాలకు శతకోటి పొర్లుదండాలు పెట్టాలి. అయినా ఏంటి రాజా ఇది.. మరీ ఇంత డామినేషనా?