సిరివెన్నెల ప్రోద్బలంతో సిత్తరాల పాట?

Sat Jan 18 2020 12:01:06 GMT+0530 (IST)

Sittharala Sirapadu song lyrics are written by Vijay Kumar Bhalla

అల వైకుంఠపురములో శీకాకుళం యాసతో జానపద గేయం పాపులరైన సంగతి తెలిసిందే. సిత్తరాల అంటూ చాలానే ఛమత్కారంగా రాసారు ఆ రైటర్ ఎవరో. ఈ పాట రాసినాయన శ్రీకాకుళం- ఒడిస్సా బార్డర్ వ్యక్తి. ఎల్ ఐసీ సీనియర్ ఉద్యోగి బల్లా విజయకుమార్ రచన ఇది. ప్రస్తుతం అతడి పేరు ఇంటా బయటా మార్మోగుతోంది. ఇంతకీ ఆయన నేపథ్యం ఏమిటి? అంటే...మాది ఒడిషాలోని జయపూర్ అని ఎల్ ఐసీలో ఉద్యోగ రీత్యా నాగావళి నుంచి వంశధార వరకు తిరిగాను అని తెలిపారు. ప్రస్తుతం మచిలీపట్నం ఎల్ ఐసీ డివిజన్ కార్యాలయంలో ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీలో మేనేజర్ గా పనిచేస్తున్నానని వెల్లడించారు. గజల్స్- జానపద గేయాలంటే చాలా ఇష్టం. ఎల్ ఐసీ నన్ను ఊరూరా తిప్పి అక్కడి జనపదాలను పరిచయం చేసింది. శ్రీకాకుళం- రాజాం- విజయనగరం- విజయవాడ- గాజువాక- వరంగల్ లో పనిచేశానని తెలిపారు.

ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే చిన్నచిన్నగా రాసిస్తుంటాను. ఈ క్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడు సీవీఆర్ శాస్త్రిగారితో మంచి అనుబంధం ఏర్పడింది. హుద్ హుద్ తుపాను సమయంలో నేను రాసిన సంకల్ప్ గీతం ఆయనకు బాగా ఇష్టం. అందువల్ల అల వైకుంఠపురంలో శ్రీకాకుళం యాసలో జానపద గేయం కావాలని దర్శకుడు త్రివిక్రమ్ తన టీంతో ఆరా తీస్తున్నారు. సీవీఆర్ శాస్త్రి గారు నా గురించి త్రివిక్రమ్ గారికి చెప్పారంట. ఆయన తన టీంతో శ్రీకాకుళంలో బాగా ప్రజాదరణ పొందిన జానపద గేయాలు అన్వేషించమని కోరారు. అలా జానపదాల పరిశోధకులు భద్రి కూర్మారావు.. రేలరేల జానకిరావుతోపాటు చాలా మందికి ఈ విషయాన్ని చెప్పాను. రకరకాలు పరిశీలించి ఏదీ కాదనుకుని చివరికి పల్లవి.. ఏడెనిమిది చరణాలు రాసిచ్చాను. అది సిత్తరాల పాటగా పాపులరైంది .. అని విజయ్ తెలిపారు.