Begin typing your search above and press return to search.

నన్ను నమ్మొద్దని నిర్మాతకి చాలామంది చెప్పారు: 'సీతా రామం' డైరెక్టర్

By:  Tupaki Desk   |   11 Aug 2022 10:54 AM GMT
నన్ను నమ్మొద్దని నిర్మాతకి చాలామంది చెప్పారు: సీతా రామం డైరెక్టర్
X
దుల్కర్ సల్మాన్ .. మృణాల్ ఠాకూర్ .. రష్మిక ప్రధానమైన పాత్రలను పోషించిన 'సీతా రామం' ఈ నెల 5వ తేదీన థియేటర్లకు వచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా వసూళ్లు మౌత్ పబ్లిసిటీటీతో పుంజుకున్నాయి. అశ్వనీదత్ నిర్మించిన 'సీతా రామం' సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో, ఈ సినిమా టీమ్ 'థ్యాంక్యూ మీట్' ను నిర్వహించింది.

ఈ వేదికపై హను రాఘవపూడి మాట్లాడుతూ .. "ఈ సినిమాను గురించి ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియడం లేదు . అంత షాక్ లో ఉన్నాను నేను. ఇంతకుముందు నాలుగైదు సినిమాలు చేశాను .. కానీ మొదటిసారి ఈ స్థాయి రెస్పాన్స్ ను చూస్తున్నాను.

ఈ సినిమా కోసం తెర వెనుక చాలామంది పని చేశారు .. ప్రథమ పాదం వాళ్లదే .. మిగిలిన శేషం ఏదైనా ఉంటే నేను తీసుకోవాలంతే. నాపై మణిరత్నం ప్రభావం చాలా ఉందని చాలామంది చెబుతుంటారు .. దానికి కారణం 'గీతాంజలి' సినిమా నాపై చూపించిన ఎఫెక్ట్ కావొచ్చు. అది ఆల్ టైమ్ నా ఫేవరేట్ ఫిల్మ్. ఆ సినిమా నుంచి నేను చాలా నేర్చుకున్నాను. దుల్కర్ నా పిచ్చిని నవ్వుతూ భరించాడు. నేను ఏం చెబితే అది చేయడానికి రెడీ అంటూ ముందుకు వచ్చాడు. ఆయనకి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను.

మృణాల్ విపరితమైన చలిని తట్టుకుంటూనే ఈ సినిమాకి వర్క్ చేశారు. 'సీతా రామం' గురించి ఎన్నేళ్ల తరువాత మాట్లాడుకోవలసి వచ్చినా, పీఎస్ వినోద్ గురించి మాట్లాడుకుంటూనే ఉంటాము. ఈ సినిమా దృశ్యకావ్యం అనిపించుకోవడానికి కారణం ఆయనే. ఈ కథ 1964లో నడుస్తున్నట్టు ఎంతో సహజంగా చూపించిన సునీల్ బాబు గారికి నేను థ్యాంక్స్ చెబుతున్నాను.

సుమంత్ గారు ఈ సినిమాలో 'విష్ణుశర్మ' పాత్రను చేసి ఉండకపోతే ఇంత వైబ్ వచ్చి ఉండేది కాదు. రష్మిక గారికి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. తన కంఫర్ట్ జోన్ ను బ్రేక్ చేసుకుని వచ్చి ఈ సినిమా చేసినందుకు ఆమెకి నేను రుణపడి ఉంటాను.

ఈ సినిమా క్రెడిట్ లో సింహభాగం స్వప్నగారిదే. నన్ను నమ్మొద్దని స్వప్నకి చాలామంది చెప్పారు కూడా. అయినా ఆమె నన్ను నమ్ముకుని ఈ సినిమా చేసింది. నాతో ఆమె 'సీతా రామం' తీయించింది. విశాల్ లేకపోతే 'సీతా రామం' సినిమాను ఊహించుకోవడం కష్టమే. అంత అద్భుతంగా చేశాడు .. అందుకు ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నాను. నేను ఏ రిజల్ట్ వస్తుందని ఆశించానో .. అదే రిజల్టును ఈ సినిమా తీసుకుని వచ్చింది. ఈ సినిమాను ఆదరించిన ఆడియన్స్ అందరికీ ఈ సినిమా టీమ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.