లిరిసిస్ట్ గా తన ఆఖరి పాటను ముందే ఊహించిన సిరివెన్నెల..!

Sun Dec 05 2021 10:00:01 GMT+0530 (IST)

Sirivennela anticipates his last song as a lyricist

లెజెండరీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇటీవలే ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధిత సమస్యలతో కన్నుమూశారు. మూడు దశాబ్దాలకు పైగా తన కలంతో సినిమాకి జీవం పోసిన సిరివెన్నెల కలం అప్పుడే ఆగిపోయిందనే విషయాన్ని చిత్ర పరిశ్రమ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. పాటల రూపంలో ఆయన బతికే ఉన్నారనే నిజంతో ముందుకు సాగుతోంది. అయితే సీతారామశాస్త్రి తన జీవితంలో లిరిసిస్ట్ గా చివరి పాటను ముందే ఊహించారనే సంగతి 'శ్యామ్ సింగరాయ్' చిత్ర బృందం ద్వారా వెల్లడైంది.



నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'శ్యామ్ సింగ రాయ్' సినిమా కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రెండు పాటలు రచించారు. ఇదే ఆయనకు గీత రచయితగా చివరి చిత్రం. అందుకే ఈ సినిమాని సిరివెన్నెలకి అంకితమిస్తున్నట్లు నాని ప్రకటించారు. అలానే ఆయన రాసిన 'సిరివెన్నెలా' అనే పాటను విడుదల చేస్తున్నట్లు చెప్పిన దర్శకుడు రాహుల్.. ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

''నవంబరు 3వ తేదీ రాత్రి సీతారామశాస్త్రి గారు ఫోన్ చేసి 'ఆరోగ్యం సహకరించక ఈ పాటను పూర్తి చేయలేకపోతున్నా ఇంకెవరితోనైనా రాయిద్దాం' అన్నారు. 'పర్వాలేదు సర్' అని చెప్పా. మరుసటి రోజు ఉదయం ఆయనే కాల్ చేసి నన్ను నిద్రలేపారు. ఆ రోజు దీపావళి. 'పల్లవి అయిపోయింది చెబుతాను రాసుకో' అన్నారు. సడెన్ గా చెప్పేసరికి ఎక్కడ రాయాలో అర్థం కాక పక్కనే ఉన్న మహాభారతం పుస్తకం మీద రాశాను" అని రాహుల్ చెప్పారు.

''అద్భుతమైన ఆరు లైన్లు ఇచ్చారు. అందులో మొదటి లైన్ లో ఆయన పేరు రాశారు. 'ఎందుకు సర్ ఈ పాటకు మీ సంతకం ఇచ్చారు' అని అడిగాను. 'బహుశా ఇదే నా చివరి పాట కావొచ్చు' అని గట్టిగా నవ్వారు'' అని రాహుల్ తెలిపారు. తన కెరీర్ లో 3 వేలకు పైగా పాటలు రచించిన దిగ్గజ లిరిసిస్ట్ సిరివెన్నెల.. తన ఆఖరి పాటను ముందే ఊహించగలిగారు. ఆయనకు నివాళిగా ఈ గీతానికి 'శ్యామ్ సింగ రాయ్' బృందం 'సిరివెన్నెల' అనే పేరు పెట్టారు.

'సిరివెన్నెల' పాట రికార్డింగ్ మొదలు పెట్టిన రోజునే ఆయన అంత్యక్రియలు జరగడం కూడా యాదృచ్చికంగానే జరిగింది. ఈ విషయాన్ని కూడా డైరెక్టర్ రాహుల్ వెల్లడించారు. సీతారామశాస్త్రి తిరిగిరాని లోకాలకు వెళ్లినా.. ఆయన పాటతో ఈ ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసే అవకాశం వచ్చిందని శ్యామ్ సింగ రాయ్ టీమ్ పేర్కొంది.

మిక్కీ జె మేయర్ స్వరపరిచిన 'సిరివెన్నెల' సాంగ్ పూర్తి లిరికల్ వీడియో డిసెంబర్ 7వ తేదీన విడుదల కానుందని మేకర్స్ తెలిపారు. సీతారామ శాస్త్రి చివరి సినిమాగా నిలిచిన 'శ్యామ్ సింగ రాయ్' క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.