Begin typing your search above and press return to search.

మహేష్ సినిమాలో సీనియర్ సింగర్!

By:  Tupaki Desk   |   9 Dec 2022 6:55 AM GMT
మహేష్ సినిమాలో సీనియర్ సింగర్!
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నప్పటికీ ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో అనే విషయంలో మాత్రం అస్సలు క్లారిటీ లేదు. ఇదివరకే ఒక కథను అనుకొని ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. మంచి యాక్షన్ ఎపిసోడ్ తోనే త్రివిక్రమ్ ఎంతో నమ్మకంగా ప్రాజెక్టును మొదలుపెట్టినప్పటికీ కూడా అనుకోకుండా మళ్ళీ ఆ కథ వద్దని మహేష్ చెప్పాడు.

దీంతో మరొక కథను రెడీ చేసుకున్న త్రివిక్రమ్ పూర్తిస్థాయిలో మరో ప్లాన్ రెడీ చేసుకోవాల్సి వస్తోంది.కేవలం కథలో మాత్రమే కాకుండా నటీనటులలో కూడా చాలా మార్పులు చేయాల్సి వచ్చింది. ఒక విధంగా నిర్మాతకు మొదటి షెడ్యూల్ కారణంగా కొంత ఆర్థికంగా నష్టపోవాల్సి కూడా వచ్చింది.

అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్ట్ ఆగకూడదు అని వీలైనంత తొందరగా మొదలుపెట్టి ఐదు నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేయాలని ఒక టార్గెట్ అయితే సెట్ చేసుకుంటున్నారు.

ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. నటీనటుల విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఒక టాక్ ప్రకారం ఈ సినిమాలో ఒక సీనియర్ లేడీ సింగర్ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబుకు సోదరి పాత్రలో ఆమెను తీసుకోబోతున్నారట.

ఆ లేడీ సింగర్ మరెవరో కాదు. గాయనీగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపును అందుకున్న సింగర్ సునీత అని తెలుస్తోంది. సింగర్ సునీత పలు కమర్షియల్ యాడ్స్ చేశారు. అలాగే టెలివిజన్ లో రియాల్టీ షోలో చేశారు. కానీ ఎప్పుడూ కూడా వెండితెరపై నటించింది లేదు. స్క్రీన్ పై ఆమెకు నటించే అవకాశాలు వచ్చినప్పటికీ కూడా చేయడానికి ఒప్పుకోలేదు.

ఇక ఇప్పుడు త్రివిక్రమ్ ఆమెను ప్రత్యేకంగా సంప్రదించడంతో మహేష్ బాబు సోదరి పాత్రలో నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అధికారికంగా క్లారిటీ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.