తెలుగు తెరపై చెరిగిపోని నవ్వుల సంతకం .. ఈవీవీ

Thu Jun 10 2021 14:00:01 GMT+0530 (IST)

Signature of indelible laughter on the Telugu screen .. EVV

తెలుగు తెరపై జంధ్యాల తరువాత ఆ స్థాయి హాస్యాన్ని పరుగులు తీయించిన దర్శకుడిగా ఈవీవీ సత్యనారాయణ కనిపిస్తారు. కథలో కామెడీ కలపడం వేరు .. కామెడీని కథగా మలచడం వేరు. ఈ రెండు ప్రయత్నాల్లోనూ ఈవీవీ సక్సెస్ అయ్యారు. అందుకు ఉదాహరణగానే 'అప్పుల అప్పారావు' .. 'ఆ ఒక్కటీ అడక్కు' .. 'హలో బ్రదర్' .. 'ఆలీబాబా అరడజను దొంగలు' కనిపిస్తాయి. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్ కి కామెడీని కలపడం సాహసమే. ఈ తరహా కథలకు కామెడీ అడ్డుపడితే అసలుకే మోసం వస్తుంది. అలాంటి ప్రయోగాన్ని కూడా ఈవీవీ అవలీలగా చేసేశారు. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీకి కాస్త రొమాన్స్ ను జోడించి థియేటర్లలో నవ్వులు పూయించారు.సాధారణంగా తొలి సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఏ దర్శకుడైనా డీలాపడిపోతాడు. కానీ ఈవీవీ ఫస్టు మూవీ 'చెవిలో పువ్వు' దెబ్బతిన్నప్పటికీ మరింత పట్టుదలతో తరువాత సినిమాలకు పనిచేశారు. ఫలితంగా వరుస విజయాలు ఆయనను వెదుక్కుంటూ వచ్చాయి. 'ప్ర్రేమఖైదీ'తో మొదలైన ఆయన విజయాల ప్రయాణం .. ప్రభంజనం నాన్ స్టాప్ గా  కొనసాగింది. అప్పటివరకూ వస్తున్న ట్రెండ్ కి తెరదించేసి కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేయడంతో అందరి దృష్టి ఆయన వైపు మళ్లింది. అలా చాలా తక్కువ సమయంలోనే ఆయన స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయారు.

ఈవీవీ యూత్ కోసం .. మాస్ కోసం .. ఫ్యామిలీ ఆడియన్స్ కోసం వేరు వేరుగా సినిమాలు చేయలేదు. అన్నివర్గాల వారికి కావలసిన అంశాలను ఆయన ఒక కథలోనే కలిపేసేవారు. ఆయనకి ఆ మోతాదు తెలిసి ఉండటం వలన ఆ సినిమాలన్నీ కూడా భారీ విజయాలను సాధించాయి. హాస్యభరిత చిత్రాల్లో ఆయన చేసిన ప్రయోగంగా'జంబలకిడి పంబ' కనిపిస్తే తన స్టైల్ కి భిన్నంగా ఆయన తెరకెక్కించిన 'ఆమె' ఒక సాహసంగా అనిపిస్తుంది. ఆయన సినిమాల్లో ప్రత్యేకమైన స్థానంలో కనిపిస్తూ ఉంటుంది. 'అమ్మో ఒకటో తారీఖు' కూడా ఆయన శైలికి భిన్నమైనదే .. ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించినదే.

'తాళి' .. 'మావిడాకులు'  .. ' కన్యాదానం' వంటి సినిమాలతో ఆయనకి విశేషమైన స్థాయిలో మహిళా ప్రేక్షకుల ఆదరాభిమానాలు లభించాయి. ఇక చివరివరకూ ఈవీవీలో కామెడీ పట్ల పట్టు తగ్గలేదనడానికి నిదర్శనంగా
'ఎవడిగోల వాడిది' .. కితకితలు' .. 'బెండు అప్పారావ్ ఆర్.ఎం.పి.'నిలుస్తాయి. అలా తాను మెగాఫోన్ పట్టిన దగ్గర నుంచి తెలుగు సినిమాను ఆయన నవ్వుల నదిలో పువ్వుల పడవలా నడిపించారు. నవరసాల్లో నవ్వు రసానికి తిరుగులేదనిపించారు. ఈ రోజున ఆయన జయంతి .. ఈ సందర్భంగా ఆయనను మనసారా ఓ సారి స్మరించుకుందాం.