ఎట్టకేలకు వెనక్కి తగ్గిన సింఘరాయ్.. కారణమిదే

Thu May 06 2021 10:00:01 GMT+0530 (IST)

Shyam Singha Roy Movie Updates

సెకండ్ వేవ్ ఉధృతితో దాదాపు 25 టాలీవుడ్ సినిమాల షూటింగుల్ని వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. డజను పైగా సినిమాల రిలీజ్ లు వాయిదా పడ్డాయి. ఇక ఇండస్ట్రీ కొంతకాలంగా స్థంబంచింది. అయినా నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం `శ్యామ్ సింఘరాయ్` షూటింగ్ కొనసాగుతోంది. కోవిడ్ భయాల నడుమ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ పూర్తి చేస్తున్నారు. అయితే అలా చేయడానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి.6.5 కోట్లతో కోల్ కతా సెట్ నిర్మించి పూర్తిగా కోల్ కతా జూనియర్ ఆర్టిస్టులు ఇతర భారీ కాస్టింగ్ తో కీలకమైన షూటింగ్ చేస్తున్నారు. భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమిది. ఒకవేళ చిత్రీకరణ ఆపాల్సి వస్తే దాని పర్యవసానం తీవ్రంగానే ఉంటుంది. పైగా రానున్నది వర్షాకాలం కాబట్టి ఇప్పటికే నిర్మించిన క్లే సెట్స్ కి ప్రమాదం వాటిల్లనుందని భావించారు. అందుకే ఇంత కఠిన పరిస్థితుల్లోనూ షూటింగ్ కి సాహసం చేశారు.

కానీ ఇప్పుడు షూటింగ్ ని తప్పనిసరై ఆపాల్సిన పరిస్థితి వచ్చిందట. యూనిట్ లోని కొందరు ముఖ్య సభ్యులకు కరోనా సోకడంతో షూటింగ్ అకస్మాత్తుగా ఆగిపోయింది. ప్రస్తుతం వీరంతా ఇంట్లోనే ఒంటరిగా ఉన్నారు. వారికి చికిత్స జరుగుతోంది. దీంతో టాలీవుడ్ లో దాదాపు అన్ని సినిమాల షూటింగులు ఆగిపోయినట్టేనని భావిస్తున్నారు. చిత్ర పరిశ్రమలో చాలా మంది వైరస్ బారిన పడుతున్నారు. షూటింగులు ఆపేసి ఇండ్లలోనే ఉన్నవారంతా క్షేమంగా ఉంటున్నారు. సాహసం చేస్తే వైరస్ భారిన పడుతున్నారు. వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయితే కొన్నిటికి పరిష్కారం దక్కే వీలుంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా చిత్రపరిశ్రమ కార్మికులందరికీ వ్యాక్సినేషన్ వేగంగా జరగాల్సి ఉంది.