ఫ్యాన్సీ రేటుకు 'శ్యామ్ సింగ రాయ్' ఆడియో రైట్స్..!

Thu Oct 21 2021 12:53:58 GMT+0530 (IST)

Shyam Singh Roy audio rights for fancy rate

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ''శ్యామ్ సింగ రాయ్''. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో సాయి పల్లవి - కృతి శెట్టి - మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా 2021 డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.పాన్ సౌత్ ఇండియా మూవీగా తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో ''శ్యామ్ సింగ రాయ్'' చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - దసరా సందర్భంగా వచ్చిన మోషన్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ మంచి రేటు పలికినట్లు తెలుస్తోంది. ఈ మూవీ సౌత్ మ్యూజిక్ రైట్స్ ని పాపులర్ ఆడియో లేబుల్ కంపెనీ సరిగమ వారు దక్కించుకున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు.

'శ్యామ్ సింగ రాయ్' చిత్రానికి మెలోడీ సాంగ్స్ స్పెషలిస్ట్ మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ ఆల్బమ్ ఆడియో రైట్స్ ని ఫ్యాన్సీ రేటుకు సరిగమ సంస్థ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

'శ్యామ్ సింఘ రాయ్' నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో భారీ వీఎఫ్ఎక్స్ వర్క్స్ తో రూపొందుతున్న సినిమా. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్యదేవ్ జంగా ఈ సినిమా కథ రాశారు. సాను జాన్ వర్గేష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రవివర్మ యాక్షన్ కొరియోగ్రఫర్ గా.. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో జిషు సేన్ గుప్తా - రాహుల్ రవీంద్రన్ - మురళీ శర్మ - అభినవ్ గోమటం - లీలా శాంసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.