కరోనాతో కమల్ .. ధైర్యం చేసిన శ్రుతిహాసన్!

Sat Nov 27 2021 16:04:48 GMT+0530 (IST)

Shruti Haasan Shares Health Update Of  Kamal Haasan

కమల్ హాసన్ తన ఆరోగ్యం విషయంలో ఎంతగా జాగ్రత్తలు తీసుకుంటారనేది ఆయనను చూస్తేనే అర్థమైపోతుంది. అలాంటి కమల్ కూడా రీసెంట్ గా కరోనా బారీన పడ్డారు. ఇటీవల ఫారిన్ వెళ్లి వచ్చిన ఆయన కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకుని చెన్నై లోని ఒక ప్రైవేటు హాస్పిటల్ లో చేరిపోయారు. తాను కరోనా బారిన పడిన విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రజనీతో సహా చాలామంది ప్రముఖులు కమల్ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు.కమల్ కరోనా బారిన పడ్డారనే విషయం తెలియగానే ఒక కూతురుగా శ్రుతి హాసన్ నిలవలేకపోయింది. తన తండ్రి దగ్గరే ఉంటూ ఆయనను చూసుకోవాలనే ఉద్దేశంతో ముంబై నుంచి బయల్దేరి చెన్నైకి చేరుకుంది. ప్రస్తుతం తన తండ్రి ఉంటున్న హాస్పిటల్లో ఆయనకి ఎలాంటి ట్రీట్మెంట్ అందుతోంది అనే విషయాలను తెలుసుకుంటూ అక్కడే ఉండాలని శ్రుతి హాసన్ నిర్ణయించుకుంది. ప్రస్తుతం కమల్ తన ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నారు. అందువలన ఆయన కోలుకున్న తరువాత ఆయనతో పాటు కొన్ని రోజులు అక్కడ ఉండాలనే శ్రుతి చెన్నైకి వచ్చిందని అంటున్నారు.

గతం చేసిన గాయాలు ఎలాంటివైనా శ్రుతి హాసన్ కి తన తండ్రి అంటే ప్రాణం. ఆయనతోనే ఆమె ఎక్కువ చనువుగా ఉంటుంది. తండ్రీ కూతుళ్లుగా కాకుండా మంచి స్నేహితులుగా వాళ్లు కనిపిస్తారు. అందువల్లనే ఈ సమయంలో తానే ఆయన దగ్గర ఉండాలనే ఉద్దేశంతో శ్రుతి చెన్నైకి వచ్చేసింది. ప్రస్తుతం ఆమె ప్రభాస్ సరసన నాయికగా 'సలార్' చేస్తోంది.

ఇక బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమాతో సెట్స్ పైకి వెళ్లనుంది. రెండు భారీ ప్రాజెక్టుల మధ్యలో ఆమె ఈ ధైర్యం చేయడం నిజంగా విశేషమే.

ఇక కమల్ విషయానికి వస్తే ఆయన సొంత బ్యానర్ పై 'విక్రమ్' సినిమా రూపొందుతోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చకచకా షూటింగు జరుపుకుంటూ వచ్చింది. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకోవడానికి తగిన కసరత్తును కమల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కరోనా బారిన పడ్డారు. తిరిగి కోలుకోగానే ఆయన మళ్లీ 'విక్రమ్' సినిమాకి సంబంధించిన పనులను చూసుకోనున్నారు.