సింగిల్ స్క్రీన్ థియేటర్లలో తెరుచుకునేవి ఎన్నో?

Fri Sep 25 2020 12:00:36 GMT+0530 (IST)

Should a large number of Single Screen theaters be shut down?

కరోనా కారణంగా ఆరు నెలల క్రితం మూత పడ్డ థియేటర్లు ఇప్పటి వరకు ఓపెన్ కాలేదు. లాక్ డౌన్ కు ముందే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ అయ్యాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లతో పాటు మల్టీప్లెక్స్ లు అన్ని కూడా ఆరు నెలలుగా మూత పడే ఉన్నాయి. ఇతర దేశాల్లో థియేటర్లు ఓపెన్ అవుతున్నా ఇండియాలో ఉన్న పరిస్థితులు మరియు వసతుల కారణంగా థియేటర్లను ఓపెన్ చేసేంతటి సాహసంను కేంద్ర ప్రభుత్వం చేయలేక పోతుంది. గత పది పదిహేను ఏళ్లుగా థియేటర్లకు తీవ్రమైన ఆర్థిక కష్టాలు నష్టాలు ఉన్నాయి. సినిమాలు పైరసీ అవ్వడం.. కొన్ని రోజుల్లోనే టీవీలో రావడం వంటి కారణా వల్ల థియేటర్లకు వస్తున్న జనాల సంఖ్య దాదాపుగా సగం తగ్గింది. గతంలో ఒక్కో సినిమా వందల రోజులు ఆడేది. కాని ఇప్పుడు రెండు  మూడు వారాలు ఆడటమే గగనం అయ్యింది.సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇప్పటికే చాలా వరకు మూత పడ్డాయి. మరికొన్నింటిని యాజమాన్యాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నడుపుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 25 శాతం వరకు పూర్తిగా మూత పడే పరిస్థితి వచ్చింది. ఆరు నెలల క్రితం మూత పడ్డ ఆ థియేటర్లు మళ్లీ ఓపెన్ అయ్యే అవకాశం లేదు. ఇప్పటికే కొన్ని థియేటర్లను కూల్చి వేయడంతో పాటు మరికొన్ని థియేటర్లను ఫంక్షన్ హాల్స్ లేదా మరో రకంగా మార్చేందుకు రెడీ అయ్యారు. వెంటనే థియేటర్లకు అన్ లాక్ చేసినా కూడా కనీసం ఆరు నెలల సమయం వరకు ప్రేక్షకులు మునుపటి మాదిరిగా థియేటర్లకు క్యూ కట్టరు. ఆ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. ఆ తర్వాత కూడా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అంటే అనుమానమే. ఎందుకంటే ఈ ఏడాది కాలంలో ప్రేక్షకులు ఓటీటీ కంటెంట్ కు బాగా అలవాటు పడ్డారు. థియేటర్లకు వెళ్లాలంటే వందలకు వందలు ఖర్చు పెట్టాలి.

నలుగురు సభ్యుల ఫ్యామిలీ సినిమాకు వెళ్లాలంటే వెయి రూపాయలు పెట్టాల్సిందే. అంత ఖర్చు పెట్టడం కంటే ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయవచ్చు అనే ఉద్దేశ్యంతో ప్రేక్షకులు ఉన్నారు. ముందు ముందు ఓటీటీలకు ఎక్కువ ఆధరణ పెరిగే అవకాశం ఉంది. కనుక థియేటర్లను కష్టంగా నడపడం ఎందుకు అనుకుంటున్న వారు మూసేస్తున్నారట. తెలుగు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో థియేటర్లు మూత పడే అవకాశం ఉందని ఒక సినీ ప్రముఖ నిర్మాత అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చెబుతున్న దాని ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్లు రాబోయే అయిదు పదేళ్లలో సగానికి పైగా తగ్గి పోతాయట. చిన్న చిన్న సిటీలు పట్టణాల్లో కూడా మల్టీప్లెక్స్ లు పుట్టుకొస్తాయని పేర్కొన్నాడు.