Begin typing your search above and press return to search.

'ఉప్పెన‌' డైరెక్ట‌ర్ కోసం సుక్కు మ్యాజిక్ చేయాల్సిందేనా?

By:  Tupaki Desk   |   29 May 2022 2:30 AM GMT
ఉప్పెన‌ డైరెక్ట‌ర్ కోసం సుక్కు మ్యాజిక్ చేయాల్సిందేనా?
X
టాలీవుడ్ లో అగ్ర ద‌ర్శ‌కుల వ‌ద్ద అసోసియేట్ లుగా వ‌ర్క్ చేసిన వారు ద‌ర్శ‌కులుగా విజ‌యాలు సాధించిన సంద‌ర్భాలు చాలా త‌క్కువే. గ‌తంలో దాసరి నారాయ‌ణ‌రావు, కె. రాఘ‌వేంద్ర‌రావుల వద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన చాలా మంది ఆ త‌రువాత ద‌ర్శ‌కులుగా మారి స‌క్సెస్ అయ్యారు. కానీ నేటి త‌రం స్టార్ డైరెక్ట‌ర్ ల వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో స‌హాయ‌కులుగా ప‌ని చేసిన వారు ద‌ర్శ‌కులుగా స‌క్సెస్ కావ‌డం లేదు. ఆ సంఖ్య చాలా త‌క్కువ‌గా వేళ్ల‌పై లెక్క‌పెట్టే విధంగా వుంటోంది.

నేటి త‌రం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లు రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్‌, సుకుమార్‌, బోయ‌పాటిల వ‌ద్ద స‌హాయ‌కులుగా ప‌ని చేసిన వాళ్లు ఆ త‌రువాత ద‌ర్శ‌కులుగా ప్ర‌య‌త్నాలు చేసి స‌క్సెస్ కాలేక‌పోతున్నారు. త‌ను వర్క్ చేసిన ద‌ర్శ‌కుడి కార‌ణంగా తొలి చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవ‌కాశాన్ని సొంతం చేసుకుని స‌క్సెస్ సాధించినా స‌రే రెండ‌వ సినిమాకు వ‌చ్చే స‌రికి మ‌ళ్లీ ఆప‌సోపాలు ప‌డుతున్నారు. రెండ‌వ సినిమాని ప‌ట్టుకునే క్ర‌మంలో కొంత క‌న్ఫ్యూజ‌న్ కు గుర‌వుతున్నారు.

స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ వ‌ద్ద అసోసియేట్ లుగా వ‌ర్క్ చేసిన వాళ్ల ప‌రిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. తొలి చిత్రాన్ని సుకుమార్ త‌నే స్వ‌యంగా నిర్మాత‌గా స‌పోర్ట్ చేస్తూ అవ‌కాశం ఇచ్చినా రెండ‌వ సినిమాని ప‌ట్టుకునే క్ర‌మంలో సుకుమార్ అసోసియేట్ లు త‌డ‌బ‌డుతున్నారు. ఆ మ‌ధ్య 'క‌రెంట్' మూవీని రూపొందించిన సుకుమార్ అసోసియేట్ ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ రెండ‌వ సినిమాని ప‌ట్టుకోవ‌డానికి దాదాపు ఆరేళ్లు ప‌ట్టింది. ఆ మూవీని స్వ‌యంగా సుకుమారే నిర్మించ‌డం గ‌మ‌నార్హం.

ఆరేళ్ల విరామం త‌రువాత పల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌కత్వంలో సుకుమార్ నిర్మించిన చిత్రం 'కుమారి 21 ఎఫ్‌'. ఈ మూవీ హిట్ అనిపించుకున్నా అత‌నికి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమా లేదు. ఇక ఇటీవ‌లే త‌న మ‌రో అసోసియేట్ బుచ్చిబాబు సానా 'ఉప్పెన‌' సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సుకుమార్ తో క‌లిసి ఈ మూవీని నిర్మించారు. వంద కోట్ల క్ల‌బ్ లో చేరిన ఈ మూవీ త‌రువాత బుచ్చిబాబు మ‌రో భారీ ప్రాజెక్ట్ ని చేయాల‌ని ప్లాన్ చేసుకున్నాడు.

అదీ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో. శ్రీ‌కాకుళం నేప‌థ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీని తెర‌పైకి తీసుకురావాల‌ని ప్లాన్ చేశాడు. అయితే ఎన్టీఆర్ ఇటీవ‌ల త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా మే 20న త‌న 30, 31 ప్రాజెక్ట్ ల‌ని అధికారికంగా ప్ర‌క‌టించాడు. ఇదే త‌ర‌హాలో బుచ్చిబాబు ప్రాజెక్ట్ ని కూడా అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని అంతా ఎదురుచూశారు కానీ అది జ‌ర‌గ‌లేదు. కార‌ణంగా పూర్తి స్థాయిలో బుచ్చిబాబు క‌థ‌ని నెరేట్ చేయ‌లేద‌ని తెలుస్తోంది. ఒక వేళ క‌థ పూర్తిగా సిద్ధం చేసినా ఎన్టీఆర్ తో సినిమా అంటే మ‌రో రెండేళ్లు ఆగ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి.

దీంతో రెండ‌వ సినిమా విష‌యంలో మ‌ళ్లీ సుక్కు మ్యాజిక్ చేస్తే కానీ వ‌ర్క‌వుట్ అయ్యేలా క‌నిపించ‌డం లేద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. మ‌రి సుక్కు త‌న శిష్యుడి కోసం మ‌రో సారి మ్యాజిక్ చేస్తాడా? .. ఎన్టీఆర్ ని ఒప్పిస్తాడా? అన్న‌ది తెలియాలంటే వేచి చూడాల్సిందే.