పెద్దమ్మాయి కష్టాల్లో ఉండగా చిన్నమ్మాయి రెడీ

Mon May 27 2019 17:38:16 GMT+0530 (IST)

Shivatmika Movie Ready To Release

జీవిత రాజశేఖర్ లకు ఇద్దరు కూతుర్లు. వారిలో పెద్దమ్మాయి శివానీ హీరోయిన్ గా 'టూ స్టేట్స్' మూవీ రీమేక్ ప్రారంభం అయ్యి చాలా నెలలు గడుస్తోంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన టూ స్టేట్స్ మూవీని తెలుగులో వెంకట్ రెడ్డి దర్శకత్వంలో సత్తి బాబు నిర్మిస్తున్నాడు. సినిమా చిత్రీకరణ 70 శాతం పూర్తి అయిన తర్వాత తనను తొలగించి మరో దర్శకుడితో సినిమాను పూర్తి చేయిస్తున్నారు అని నా స్క్రిప్ట్ లో మార్పులు చేయిస్తున్నారు అంటూ వెంకట్ రెడ్డి కోర్టును ఆశ్రయించాడు.వెంకట్ రెడ్డి కోర్టుకు ఎక్కడంతో ఇప్పుడు సినిమా పై స్టే వచ్చే అవకాశం ఉంది. ఆ వివాదం సర్దుమనిగేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు. ఈ రీమేక్ కు ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న దర్శకుడిపై చర్యలకు వెంకట్ రెడ్డి రెడీ అవుతున్నాడు. తాను మొదలు పెట్టిన సినిమాను మరో దర్శకుడు టేకప్ చేశాడంటూ.. అతడిపై చర్యలు తీసుకోవాలంటూ దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయట. ఇలా వివాదాల నడుమ పెద్దమ్మాయి శివానీ సినిమా ఆగిపోయే పరిస్థితి వచ్చింది.

ఇదే సమయంలో చిన్నమ్మాయి శివాత్మిక హీరోయిన్ గా నటిస్తున్న 'దొరసాని' చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. జులై నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. మొదట పెద్ద కూతురు హీరోయిన్ గా వస్తుందని భావించిన జీవిత రాజశేఖర్ లకు షాకింగ్ గా శివానీకి ముందే శివాత్మిక హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శివానీని మరో సినిమాలో నటింపజేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. దొరసాని చిత్రం సక్సెస్ అయితే శివాత్మిక క్రేజ్ అమాంతం పెరగడంతో పాటు వరుసగా ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.