Begin typing your search above and press return to search.

#అసుర‌న్: ఇక్క‌డ వెంకీ అక్క‌డ శివ‌న్న‌

By:  Tupaki Desk   |   24 March 2020 4:30 AM GMT
#అసుర‌న్: ఇక్క‌డ వెంకీ అక్క‌డ శివ‌న్న‌
X
ఒక భాషలో బ్లాక్‌ బస్టర్‌ అయిన సినిమాని మరో భాషలో రీమేక్‌ చేయడం తొలి నుంచి చూస్తున్న‌దే.కాన్సెప్ట్ యూనివర్సల్ గా ఉన్నప్పుడు.. సోల్‌ మిస్‌ కాకుండా.. నెటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి రూపొందించిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి. నాలుగైదు భాషల్లో రీమేక్‌ అయి విజయాలు కూడా సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే సోల్ మిస్స‌యిన ప్ర‌తిసారీ అదే ప్ర‌తిబంధ‌కంగా మారి ఫ్లాపులు ఎదురైన సంద‌ర్భాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన `దృశ్యం`.. `ప్రేమమ్‌`... అప్పట్లో వచ్చిన `ఖుషీ`.. లాంటి చిత్రాలు ఘ‌న‌వియం సాధించిన జాబితాలో నిలిచాయి.

ఇటీవ‌ల ప‌లు త‌మిళ చిత్రాలు తెలుగులో అనువాద‌మై విజ‌యం సాధించాయి. రాక్ష‌సుడు- ఖైదీ లాంటి చిత్రాలు అందుకు ఉదాహ‌ర‌ణ‌లు. మ‌రో తమిళ బ్లాక్ బ‌స్ట‌ర్ `అసురన్‌` ఇప్పుడు అదే కోవలో ఇతర భాషల్లోకి అనువాద‌మ‌వుతోంది. ధనుష్‌ హీరోగా కోలీవుడ్ లో విడుదలైన అసుర‌న్ 2019 బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. తక్కువ కులం వారికి.. ఎక్కువ కులం వారికి మధ్య అంతరాలను.. అందులోని సంఘర్షణని తెలిపే కథాంశంతో ఆద్యంతం రియలిస్టిక్ గా రూపొందిన ఈ సినిమా ధనుష్‌ కెరీర్ లోనే ది బెస్ట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాని ప్రస్తుతం తెలుగులో విక్ట‌రీ వెంకటేష్‌ హీరోగా రీమేక్‌ చేస్తున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియమణి కథానాయికగా నటిస్తోంది. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ వేగంగా సాగుతున్నా.. కరోనా వల్ల నిలిపేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో వెంకీ యువకుడిగా.. ఇద్దరు అబ్బాయిలకు తండ్రిగా రెండు భిన్న గెటప్ లో కనిపించనున్నారు.

మరోవైపు కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్ .. వెంకీ త‌ర‌హాలో ధ‌నుష్ పాత్ర‌లోకి ప‌ర‌కాయం చేయ‌బోతున్నాడ‌ట‌. క‌న్నడ `అసురన్‌`లో శివన్న నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని శాండ‌ల్వుడ్ మీడియాలో ప్ర‌చార‌మ‌వుతోంది. రియలిస్టిక్‌ కథలను.. డీగ్లామర్‌ పాత్రలను బాగా ఇష్టపడే ఆయన ఈ రీమేక్ లో నటించేందుకు సిద్దమవుతున్నాడట. జాకబ్ వ‌ర్ఘీస్ అనే దర్శకుడు దీనికి దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. క‌థానుసారం వెంకీ మాదిరిగానే శివన్న కూడా రెండు భిన్నమైన గెటప్ లో కనిపించాల్సి ఉంటుంది. ఇలాంటి నేచురల్‌ రోల్స్ వచ్చినప్పుడు తన నటనలోని మరో లెవల్ ని చూపించే శివరాజ్‌కుమార్‌ ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్‌ రీమేక్ లో స‌త్తా చాటాల‌ని క‌సిగా ఉన్నాడ‌ట‌.

మరోవైపు శివ‌న్న పాన్ ఇండియా సినిమాని ప్లాన్‌ చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. శివ ధూళిపూడి అనే నూతన దర్శకుడి డైరెక్షన్ లో తెలుగు- తమిళంలో ఓ ద్విభాషా చిత్రం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందులో ఆయన ఎప్పుడూ కనిపించని విధంగా చాలా కొత్త గెటప్ లో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాని శ్రీకాంత్‌ ధుళిపూడి- శ్రీనివాస్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. సెప్టెంబర్‌లో షూటింగ్‌ ప్రారంభించ‌నున్నారు. ఇక ప్రస్తుతం శివరాజ్‌ కుమార్‌ కన్నడలో `భజరంగి2`.. `ఆర్‌డీఎక్స్`.. `భైరతి రణగళ్లు` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.