ఆ మెగా మల్టీస్టారర్ పెద్ద గొడవే రాజేసింది

Wed Jul 11 2018 15:09:54 GMT+0530 (IST)

Shivarajkumar fans to boycott The Villain as director Prem turns villain

ఇద్దరు స్టార్ హీరోలతో ఒక సినిమా తీయాలంటే అంత సులువైన విషయమేమీ కాదు. వాళ్ల అభిమానుల్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా స్క్రిప్టు తయారు చేయాలి. ఇద్దరిలో ఏ హీరోకూ ప్రాధాన్యం తగ్గిపోకుండా చూసుకోవాలి. పాటలు.. ఫైట్లు విషయంలో బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ విషయంలో తేడా కొట్టేయడంతో ఓ కన్నడ మల్టీస్టారర్ పెద్ద వివాదమే రాజేస్తోంది. కన్నడలో బడా స్టార్లయిన శివరాజ్ కుమార్.. కిచ్చా సుదీప్ కాంబినేషన్లో ‘ది విలన్’ అనే సినిమా తెరకెక్కింది. రక్షిత భర్త అయిన స్టార్ డైరెక్టర్ ప్రేమ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు.ఐతే ఈ సినిమాలో తమ హీరోకు ప్రాధాన్యం తగ్గించేశారని.. కావాలనే ఆయన్ని డౌన్ ప్లే చేశారని శివరాజ్ కుమార్ ఫ్యాన్స్ గొడవ చేస్తున్నారు. ఇద్దరు హీరోలకు వేర్వేరుగా రెండు టీజర్లు రిలీజ్ చేస్తే.. అందులో సుదీప్ టీజర్ మాత్రమే బాగుందని.. శివరాజ్ టీజర్ కావాలనే సరిగా తీర్చిదిద్దలేదని అంటున్నారు. ఈ చిత్ర పోస్టర్లలోనూ శివరాజ్ కుమార్ ఫొటో చిన్నగా వేసి.. సుదీప్ ఫొటో పెద్దదిగా వేశారని అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. అలాగే ఈ సినిమాలో సుదీప్ కు మూడు పాటలు పెట్టి.. శివరాజ్ కు రెండు పాటలే పెట్టారన్న వార్త కూడా బయటకి రావడంతో దాని మీదా గొడవ చేస్తున్నారు.

ఈ వివాదం అంతకంతకూ పెరిగి పెద్దదై.. ఈ చిత్రాన్ని బహిష్కరించాలంటూ శివరాజ్ కుమార్ ఫ్యాన్స్ పిలుపు ఇచ్చే వరకు పరిస్థితి వెళ్లింది. ఈ విషయంలో అభిమానుల్ని వారించాల్సిన శివరాజ్ సైలెంటుగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఐతే దర్శకుడు ప్రేమ్ ఈ వివాదంపై స్పందిస్తూ.. అభిమానులు నొచ్చుకుని ఉంటే సారీ చెబుతానన్నాడు. తాను స్వయంగా శివరాజ్ కు పెద్ద అభిమానినని.. అనవసర వివాదాలు రాజేయొద్దని అతను ఫ్యాన్స్ కు పిలుపు ఇచ్చాడు. మరి ఈ గొడవ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.