మిస్ ఇండియా పోటీల నుంచి వైదొలిగిన శివాని రాజశేఖర్..!

Wed Jun 29 2022 19:09:21 GMT+0530 (IST)

Shivani Rajasekhar withdraws from Femina Miss India

సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ - జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలు ఆసక్తికర ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న శివాని.. ఫెమినా మిస్ ఇండియా-2022 అందాల పోటీలో ఫైనలిస్ట్ లలో ఒకరిగా నిలిచిన సంగతి తెలిసిందే.ఇప్పటికే 'మిస్ తమిళనాడు' గా ఎంపికైన ఈ బ్యూటీ.. త్వరలో జరగనున్న గ్రాండ్ ఫినాలేలో ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా శివానీ మిస్ ఇండియా రేసు నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు.

శివానీ ఒక మెడికల్ స్టూడెంట్ అనే సంగతి చాలా కొద్ది మందికే తెలుసు. అయితే ఫెమినా మిస్ ఇండియా-2022 గ్రాండ్ ఫినాలే జరగనున్న జూలై 3న ఆమె తన ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కు అటెండ్ అవ్వాల్సి ఉంది. ఈ కారణం చేతనే రాజశేఖర్ తనయ ఫెమినా మిస్ ఇండియా పోటీ నుంచి వైదొలిగింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ నోట్ పోస్ట్ చేసింది శివాని.

"మొదట నా మెడికల్ థియరీ పరీక్షల కారణంగా.. తరువాత నేను మలేరియా బారిన పడటం వలన మెజారిటీ ట్రైనింగ్ మరియు వస్త్రధారణ సెషన్‌లు - అన్ని సబ్-కాంటెస్ట్ లను కోల్పోవడం చాలా దురదృష్టకరం. నేను త్వరలో తిరిగి పుంజుకుంటానని ఆశించాను. కానీ నేను అనుకున్నట్లుగా ఏమీ లేదు. నా ప్రాక్టికల్ పరీక్షలు ప్రీ-పోన్ చేయబడ్డాయి. అవి ఈరోజు నుంచే ప్రారంభమవ్వగా.. ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే జరగనున్న జులై 3న కూడా నాకు ఎగ్జామ్ ఉంది. అందుకే ఇకపై నేను ఈ జర్నీలో భాగం కాదు" అంటూ శివాని బాధ పడుతూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.

మిస్ ఇండియా పోటీల కోసం తనకు సహకరించిన టీమ్ మొత్తానికి కృతజ్ఞతలు తెలిపింది శివాని. పోటీలో ముందుకు వెళ్లలేకపోయినందుకు క్షమించమని కోరింది. ప్రస్తుతం ఆరోగ్య పరంగా కోలుకుంటున్నానని.. త్వరలోనే పరీక్షలన్నీ సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తానని ప్రకటించింది. వచ్చే ఏడాది పునరాగమనం చేయాలని ఆమె భావిస్తోంది. ప్రస్తుతం ఆమె తన ఎక్జామ్స్ కోసం గుంటూరులో ఉంది.

కాగా 'అద్భుతం' సినిమాలో హీరోయిన్ గా నటించిన శివాని రాజశేఖర్.. ఇటీవల తన తండ్రితో కలిసి 'శేఖర్' చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం రాజ్ తరుణ్ తో కలిసి 'అహ నా పెళ్లంట' అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ రోమ్-కామ్.. 8 ఎపిసోడ్స్ గా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.