వాళ్లను వదిలే ప్రసక్తే లేదు: శివబాలాజీ

Mon Sep 21 2020 21:30:17 GMT+0530 (IST)

Shivabalaji complains to DEO on Mount Literazi School

సామాన్యులకే కాదు.. సెలెబ్రెటీలకు కూడా స్కూల్ ఫీజులు కంగారెత్తిస్తున్నాయి. కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రతి తల్లిదండ్రులకు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఫీజుల భారం తడిసి మోపెడు అవుతోంది.ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఆన్ లైన్ క్లాసుల పేరుతో భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయని రంగారెడ్డి జిల్లా డీఈవోకు నటుడు శివబాలాజీ ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్ లోని మణికొండ మౌంట్ లీటేరాజీ స్కూల్.. తన పిల్లలకు ఎలాంటి సమాచారం లేకుండానే ఆన్ లైన్ క్లాస్ నుంచి తొలగించడంపై ఆయన గతంలో హెచ్.ఆర్.సీకి ఫిర్యాదు చేశారు.

తాజాగా స్కూల్ యాజమాన్యం ఆన్ లైన్ క్లాసుల పేరుతో విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని డీఈవో విజయలక్ష్మీకి వివరించారు. పెంచిన ఫీజులను తగ్గించాలని కోరితే తమకు సమాచారం లేకుండానే తమ పిల్లలను తొలగించారని చెప్పారు. దీనివల్ల అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. స్కూల్ యాజమాన్యం విద్యార్థుల పట్ల ఈ విధంగా వ్యవహరించడంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మౌంట్ లీటేరాజ్ స్కూల్ రూల్స్ కు విరుద్ధంగా ఫీజులు వస్తోందని.. ఆన్ లైన్ క్లాసుల నిర్వహణతో దోచుకుంటోందని.. ఆ స్కూల్ గుర్తింపు రద్దు అయ్యే వరకు పోరాడుతామన్నారు.