ది లూప్ తో శింబు మళ్ళీ తెలుగువారికి దగ్గరవుతాడా..?

Tue Nov 23 2021 22:00:01 GMT+0530 (IST)

Shimbu Close To Telugu People With His New Movie

'మన్మథ' 'వల్లభ' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకర్షించిన తమిళ హీరో శింబు. వినూత్నమైన సినిమాలతో కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న శింబు.. తెలుగులో సక్సెస్ అందుకొని చాలా కాలంలమైంది. అయితే ఇప్పుడు 'మానాడు' అనే సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో అలరించడానికి రెడీ అయ్యారు శింబు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని ''ది లూప్'' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నవంబర్ 26న థియేటర్లలో ఈ సినిమా కానుంది.సైన్స్ ఫిక్షన్ అంశాలతో పొలిటికల్ యాక్టన్ థ్రిల్లర్ గా ''ది లూప్'' చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రచార చిత్రాలు - ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. టైమ్ లూప్ కాన్సెప్ట్ తో కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు తమ ఉనికి కోసం సామాన్యుల్ని ఎలా వాడుకుంటున్నారనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఓ యువకుడి జీవితంలో ఓ ఘటన మళ్లీ మళ్లీ ఎందుకు ఎదురవుతుంటుంది? ఆ యువకుడు ఆడిన రాజకీయ చదరంగం ఎలాంటిది? టైం లూప్ నుంచి అతను బయటపడ్డాడా లేదా? అనేది చాలా ఆసక్తిగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

'ది లూప్' సినిమాలో శింబు సరసన కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కోసం శింబు తన ఆహార అలవాట్లు అన్నీ మార్చుకొని 27 కేజీల బరువు తగ్గారు. ఎస్.జె సూర్య - భారతీరాజా - ఎస్.ఏ.చంద్రశేఖర్ - ప్రేమ్ జీ - కరుణాకరన్ - మహేంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. రిచర్డ్ నాథన్ సినిమాటోగ్రఫీ అందించగా.. ఉమేష్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ వర్క్ చేశారు.

వి.హౌస్ పతాకంపై సురేష్ కామాక్షి భారీ బడ్జెట్ తో 'మానాడు' చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో 'ది లూప్' మూవీని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అల్లు అరవింద్ - బన్నీ వాసు కలిసి గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా సరే తెలుగులో హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయిన శింబు కు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.