Begin typing your search above and press return to search.

రాజ్ కుంద్రా వివాదంపై శిల్పాశెట్టి తొలి ప్రకటన

By:  Tupaki Desk   |   2 Aug 2021 8:34 AM GMT
రాజ్ కుంద్రా వివాదంపై శిల్పాశెట్టి తొలి ప్రకటన
X
ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అశ్లీల వీడియో రాకెట్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత.. ఆయన భార్య, ప్రముఖ నటి శిల్పాశెట్టి ఈరోజు తన మొదటి సంచలన ప్రకటనను విడుదల చేశారు. మీడియాలో, బయటా రాజ్ కుంద్రా గురించి.. తన గురించి జరుగుతున్న ప్రచారంపై సంచలన ప్రకటన చేశారు. తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తమపై వస్తున్న పుకార్లు, ఆరోపణలను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు.

ఈ వివాదంపై తాను ఎవ్వరికీ వివరణ ఇవ్వడం లేదని.. తమపై అన్యాయంగా అపవాదులు వేస్తున్న కారణంగానే ఈ ప్రకటనలో తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్న శిల్పాశెట్టి రాసుకొచ్చింది.

మీడియా, సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లపై శిల్పాశెట్టి మండిపడింది. తమ పరువుకు నష్టం కలిగించే విషయాలను అవి ప్రచురించాయని శిల్పా శెట్టి ఆరోపించింది. ఇప్పటికే దీనిపై శిల్పా శెట్టి ముంబై హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘ఎప్పుడూ ఫిర్యాదు చేయవద్దు.. వివరించవద్దని’ అనుకున్నానని.. కానీ తమపై చేస్తున్న చెడు ప్రచారానికి బయటకొచ్చానని వివరించింది.


శిల్పాశెట్టి జారీ చేసిన ప్రకటనలో ‘అవును.. కొన్ని రోజులుగా ప్రతి రోజు సవాల్ గా మారింది. చాలా పుకార్లు, ఆరోపణలు తమపై వస్తున్నాయి. మీడియా ప్రచారం వల్ల తమ శ్రేయోభిలాసులు కూడా తమకు దూరంగా జరుగుతున్నారని శిల్పాశెట్టి వాపోయింది. నాకు మాత్రమే కాకుండా నా కుటుంబానికి కూడా చాలా ట్రోలింగ్/ప్రశ్నలు ఎదురవుతున్నాయని తెలిపింది. నా స్టాండ్ నేను తీసుకుంటున్నానని.. ఎవరినీ కామెంట్ చేయడం లేదని.. ఈ కేసుపై పోరాడుతానని శిల్పాశెట్టి పేర్కొంది. కాబట్టి దయచేసి నా తరుఫున తప్పుడు ప్రచారాలను ఇప్పటికైనా ఆపివేయండని శిల్పాశెట్టి పేర్కొంది.

తాను ఒక ప్రముఖురాలినని టార్గెట్ చేయడం ఆపాలని శిల్పాశెట్టి ప్రకటనలో పేర్కొంది. ముంబై పోలీసుల దర్యాప్తు, న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని..మా అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన పరిష్కారాలను మేము ఆశిస్తున్నట్టు శిల్పాశెట్టి తెలిపింది. అప్పటి వరకు తమ విషయంలో అవాస్తవాలు ప్రచారం చేయవద్దని కోరింది.

ముఖ్యంగా తల్లిగా.. నా పిల్లల కోసం మా గోప్యతను గౌరవించాలని.. సగం సగం తెలిసిన సమాచారంతో మా కుటుంబాన్ని టార్గెట్ చేయవద్దని శిల్పా శెట్టి మీడియాను కోరుతూ దుష్ప్రచారం మానుకోవాలని అభ్యర్థించింది.

నేను భారత చట్టాన్ని పాటించే భారతీయ పౌరురాలిని అని.. గత 29 సంవత్సరాలుగా కష్టపడి పనిచేసి సినిమా ఇండస్ట్రీలో ఎదిగానని శిల్పా శెట్టి తెలిపింది. ప్రజలు నాపై విశ్వాసం ఉంచారు.. నేను ఎవరినీ నిరాశపరచలేదన్నారు. ఈ కాలంలో మీరు నా కుటుంబం.. గోప్యతపై 'నా హక్కు'ను గౌరవించాలని మీడియాకు అందరికీ సూచించింది. మీడియా విచారణకు అర్హులు కాదని... దయచేసి చట్టం దాని పనిని దాన్ని చేసుకోనివ్వండి అంటూ శిల్పాశెట్టి ప్రకటనలో విన్నవించింది. సత్యమేవ్ జయతే! అంటూ శిల్పా శెట్టి చివర్లో ముగించింది.