అప్పటి స్టార్ హీరోలందరికీ ఆమెనే 'అమ్మ'

Fri Apr 23 2021 06:00:01 GMT+0530 (IST)

She was the 'mother' of all the star heroes of that time.

తెలుగు తెరపై 'అమ్మ' పాత్రలకి పెట్టింది పేరు .. నిర్మలమ్మ. మంచి వయసులో ఉన్నప్పుడే ఆమె 'అమ్మ' పాత్రలను పోషించడం విశేషం. నిజం చెప్పాలంటే అన్ని పాత్రల కంటే 'అమ్మ' పాత్రను పోషించడమే కష్టం. ఎందుకంటే అమ్మ పాత్రలో సహజత్వం ఉండాలి .. ఆత్మీయత ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ పాత్ర పడుతుంది. అలాంటి పాత్రల్లో పసిడి ఉంగరంలో పగడంలా ఇమిడిపోయిన నటిగా నిర్మలమ్మ కనిపిస్తుంది. డైలాగ్స్ ను ముక్కలుగా తెగ్గొట్టకుండా కలుపుగోలుతనంతో కలుపుకుపోతూ పలకడం ఆమె ప్రత్యేకత. అలాంటి నిర్మలమ్మను గురించి తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు."మేము రాసిన సినిమాల్లో నిర్మలమ్మ ఎన్నిట్లో చేశారో చెప్పలేంగానీ మొత్తంగా ఆమె ఓ 800 నుంచి 900 సినిమాల వరకూ చేసి ఉంటారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లతోను శోభన్ బాబు .. కృష్ణలతోను .. ఆ తరువాత తరం హీరోలతోనూ కలిసి ఆమె నటించారు. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పటి స్టార్ హీరోలందరికీ ఆమెనే అమ్మ. నాకు తెలిసి ఒకానొక దశలో ఎస్వీ కృష్ణారెడ్డి .. ఈవీవీ సత్యనారాయణ ఇద్దరూ కూడా నిర్మలమ్మ పాత్ర లేకుండా సినిమా తీసేవారు కాదు. నిర్మలమ్మగారిని ఒక ఆర్టిస్టుగా చూడలేం .. ఆమెను చూస్తుంటే మన పక్కింట్లో బామ్మను చూస్తున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది.

నిర్మలమ్మ చాలా సహజంగా నటిస్తూ ఉంటుంది .. అది ఒక సినిమా .. అది ఒక నటన మాత్రమే అని ఎవరికీ అనిపించదు .. అదీ నిర్మలమ్మ గొప్పతనం. సినిమా ఇండస్ట్రీలో పెద్దలు కొన్ని మాటలు చెబుతూ ఉంటారు. అలా నాకు చెప్పినవాళ్లలో ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. శోభన్ బాబు .. కృష్ణగారు ఉన్నారు. అలాగే నిర్మలమ్మగారు నాకు ఒక మాట చెప్పారు. "నువ్వు ఎదుగుతున్నప్పుడు నీ చుట్టూ కొంతమంది చేరతారు. వాళ్లలో నువ్వు చేరదీసినవారిని బట్టే నువ్వు పెరగడం .. తగ్గడం ఉంటుంది" అన్నారు. ఆ మాటను నేను ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నాను .. అందుకే ఇంతదూరం ప్రయాణించగలిగాను" అని చెప్పుకొచ్చారు.