వెంకటేష్ వేసిన బాటలో నడుస్తున్న శర్వానంద్...!

Tue Oct 20 2020 20:30:28 GMT+0530 (IST)

Sharwanand walking on the path laid by Venkatesh ...!

విక్టరీ వెంకటేష్ - కిశోర్ తిరుమల కాంబినేషన్ లో ''ఆడాళ్లూ.. మీకు జోహార్లు'' అనే సినిమా రూపొందనుందని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి 'నేను శైలజ' వంటి సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత కిశోర్ తిరుమల ఈ స్టోరీ వెంకటేష్ కి చెప్పడం.. దానికి వెంకీ చెప్పడం కూడా జరిగిపోయాయి. అయితే ఎందుకో ఈ ప్రాజెక్ట్ ముందుకు కదలలేదు. అదే సమయంలో కిశోర్ తిరుమల 'ఉన్నది ఒకటే జిందగీ' 'చిత్రలహరి' 'రెడ్' సినిమాలు చేసుకుంటూపోయాడు. వెంకటేష్ కూడా వేరే ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యాడు. అయితే ఇప్పుడు 'ఆడాళ్లూ.. మీకు జోహార్లు' సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి కిశోర్ రెడీ అయ్యారని తెలుస్తోంది. అయితే వెంకటేష్ తో కాకుండా టాలెంటెడ్ హీరో శర్వానంద్ తో చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారని సమాచారం.శర్వానంద్ హీరోగా 'ఆడాళ్లూ.. మీకు జోహార్లు' చిత్రాన్ని దసరాకి పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారభించనున్నారని తెలుస్తోంది. ఇంతకముందు శర్వాతో 'పడి పడి లేచె మనసు' చిత్రాన్ని నిర్మించిన సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని యస్.యల్.వి బ్యానర్ పై నిర్మించనున్నారు. వెంకటేష్ కి చెప్పిన స్టోరీలో శర్వానంద్ కు తగ్గట్లు డైరెక్టర్ చాలా మార్పులు చేశారట. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. మొత్తం మీద వెంకటేష్ తో అనుకున్న ఈ ప్రాజెక్ట్ యువ హీరో చేతిలో వచ్చి పడింది. శర్వానంద్ ప్రస్తుతం 'శ్రీకారం' అనే సినిమాతో పాటు.. ఓ తెలుగు తమిళ ద్విభాషా చిత్రం కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. అలానే అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహాసముద్రం' చిత్రాన్ని ప్రకటించాడు. దిల్ రాజు ప్రొడక్షన్ లో ఓ సినిమా ఉంటుందని తెలుస్తోంది.