శర్వా - 14 రీల్స్ ప్లస్ వివాదం.. లోగుట్టు పెరుమాళ్ళకెరుక..!

Mon May 31 2021 15:04:47 GMT+0530 (IST)

Sharwanand Controversy between 14 Reels Plus producers

'శ్రీకారం' సినిమా విషయంలో హీరో శర్వానంద్ - 14 రీల్స్ ప్లస్ నిర్మాతల మధ్య వివాదం తలెత్తిందని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గానూ శర్వా కు రూ.6 కోట్లు ఇచ్చేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారట. ఇందులో 4 కోట్లు విడుదలకు ముందే చెల్లించగా.. రిలీజ్ తర్వాత ఇస్తామన్న 2 కోట్ల రెమ్యునరేషన్ ను నిర్మాతలు పెండింగ్ లో పెట్టారట. శర్వా టీమ్ పదే పదే అడగడంతో నిర్మాతలు మరో యాభై లక్షలు ఇచ్చి.. రూ.1.5 కోట్లకు చెక్ ఇచ్చారట. అయితే ఆ చెక్ బౌన్స్ అవ్వడం.. దీని గురించి నిర్మాతల వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో 14 రీల్స్ ప్లస్ వారికి శర్వా లీగల్ నోటీసులు పంపారని ప్రచారం జరుగుతోంది.అయితే హీరోకు ఇవ్వాల్సిన బ్యాలన్స్ రూ.1.5 కోటి విషయంలో కోర్టు దాకా వెళ్లడం అంత నమ్మశక్యంగా లేదని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. నిజానికి ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే హీరోల్లో శర్వానంద్ ఒకరు. ఎప్పుడూ ఎవరితో ఏ ఇష్యూ లేకుండా కామ్ గోయింగ్ హీరో గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అలా ఏమన్నా వివాదాల్లో ఉండే హీరో అయితే శర్వా కెరీర్ ఇంకోలా వుండేది. అలానే 14 రీల్స్ ప్లస్ నిర్మాతలు కూడా వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తులే. గతంలో స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తీసినా ఎప్పుడూ వీరి మీద ఎలాంటి ఆరోపణలు రాలేదు. అలాంటిది ఇప్పుడు డబ్బుల విషయంలో నిర్మాతలు - హీరోల మధ్య ఇష్యూ రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

నిజంగానే డబ్బుల విషయమే అయ్యుంటే.. టాలీవుడ్ పెద్ద బ్యానర్లలో ఒకటైన 14 రీల్స్ ప్లస్ నిర్మాతలు దీన్ని కోర్టు వరకూ వెళ్లనిచ్చే వారు కాదు. ఇప్పటికే హీరో - నిర్మాతలు కూర్చొని మ్యాటర్ సెటిల్ చేసుకునేవారు. మాటల్లో పోయేదాన్ని ఇలా కోర్టుల దాకా మీడియా దాకా తెచ్చుకోవాలని ఎవరూ అనుకోరు. అలానే వివాదాలకు దూరంగా ఉండే శర్వా కూడా కేవలం మనీ కోసమే కోర్టుకి వెళ్లాడంటే ఇండస్ట్రీ జనాలు నమ్మడం లేదు. ఏ హీరో కూడా పేరున్న ప్రొడ్యూసర్స్ తో అంత ఈజీగా సంబంధాలు తెంచుకోవాలని అనుకోరు. నిర్మాతలు కూడా హీరోతో రిలేషన్ పోగొట్టుకోవాలని చూడరు.

ఇదంతా చూస్తుంటే ఈ వ్యవహారం ఇక్కడి దాకా రావడానికి డబ్బులు విషయం ఒక్కటే కారణం కాదనిపిస్తోందని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. శర్వానంద్ - 14 రీల్స్ ప్లస్ నిర్మాతల మధ్య మిస్ కమ్యూనికేషన్ వల్ల ఏదో ఇష్యూ జరిగి ఉంటుందని.. అందుకే ఇక్కడి వరకు వచ్చిందని టాక్ నడుస్తోంది. అదేదైనా మీడియాలో రోజుకో వార్త వచ్చి ఇష్యూ ఇంకా పెద్దది కాకముందే.. ఇరువర్గాలు కూర్చొని మాట్లాడుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటే మంచిదని ఇండస్ట్రీ వర్గాలు సూచిస్తున్నాయి.