ప్రతిసారీ ఆ మాటెందుకు శర్వా?

Tue Dec 18 2018 19:55:25 GMT+0530 (IST)

Sharwanand Comments On Flop Director

యువ కథానాయకుడు శర్వానంద్ చాలా ఓపెన్ గా మాట్లాడుతుంటాడు. మాటలకు ముసుగేయడు. మామూలుగా హీరోలు తమ ఫ్లాప్ సినిమాల గురించి మాట్లాడ్డానికి ఇష్టపడరు. కానీ శర్వా అలా కాదు. తప్పొప్పుల్ని నిజాయితీ గా సమీక్షిస్తుంటాడు. గతం లో శర్వా నిర్మించిన ‘కో అంటే కోటి’ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఐతే అదేమీ చెత్త సినిమా కాదు. కొంచెం డిఫరెంట్ గా ఏదో ట్రై చేశారు. కానీ అది వర్కవుట్ కాలేదు. ఐతే మంచి సినిమా తీసినా జనాలు చూడలేదని వాళ్లను నిందించలేదు శర్వా. తప్పు తమదే అని.. జనాలు కోరుకున్నట్లుగా తాము తీయలేదని నిజాయితీగా అంగీకరించాడు. అతడి మాట తీరెప్పుడూ ఇలాగే ఉంటుంది. ఇదే అతడిని ప్రత్యేకంగా నిలబెడుతూ ఉంటుంది. కానీ ఈ క్రమంలో శర్వా ఈ మధ్య మరీ ఓపెన్ అయిపోతున్నట్లుగా కనిపిస్తున్నాడు.తన కొత్త సినిమా ‘పడి పడి లేచె మనసు’ ప్రమోషన్ల లో అతను దర్శకుడు హను రాఘవపూడి గురించి ప్రస్తావించినపుడల్లా ఫ్లాప్ డైరెక్టర్ ఫ్లాప్ డైరెక్టర్ అని పేర్కొంటుండటం గమనార్హం. ఇప్పటికే రెండు ఇంటర్వ్యూల్లో హను గురించి ఆ మాట అన్నాడు శర్వా. ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ‘లై’ లాంటి ఫ్లాప్ తీసినప్పటికీ అదేమీ పట్టించుకోకుండా నిర్మాత కథను నమ్మి ఈ సినిమా తీశాడన్నాడు. ఈ సినిమా మొదలయ్యేటప్పటికి తాను సాయిపల్లవి తప్ప ఆకర్షణలేమీ లేవని.. హను ‘లై’ లాంటి ఫ్లాప్ తర్వాత ఈ సినిమా తీశాడన్నాడు.

తాజాగా ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ హనును మరోసారి ఫ్లాప్ డైరెక్టర్ అని సంబోధించాడు. మీడియా వాళ్లు ఆ విషయమే ప్రస్తావించి ఈ సినిమా పై ఇంత బడ్జెట్ ఎలా పెట్టారని అడిగారని.. ఐతే స్క్రిప్టును నమ్మే సాహసం చేశామన్నాడు. శర్వా కు దురుద్దేశాలేమీ లేకపోవచ్చు కానీ.. ఒక ఫ్లాప్ తీసినంత మాత్రాన మళ్లీ మళ్లీ ఆ విషయాన్ని ప్రస్తావించడం సహేతుకం కాదు. నిజానికి ‘లై’ అంత పెద్ద ఫ్లాప్ కావాల్సిన సినిమా ఏమీ కాదు. అందులో కంటెంట్ బాగానే ఉంటుంది కానీ.. ఎక్కడో తేడా కొట్టింది. మరి ‘పడి పడి లేచె మనసు’తో హిట్టు కొట్టి ఈ ముద్ర ను హను తొలగించుకుంటాడేమో చూద్దాం.