న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన శర్వానంద్...!

Tue Aug 04 2020 22:00:44 GMT+0530 (IST)

Sharwanand announces new project ...!

టాలీవుడ్ లో హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూకుడు చూపిస్తున్నారు యంగ్ హీరో శర్వానంద్. కెరీర్ స్టార్టింగ్ నుండి విలక్షణమైన పాత్రలను విభిన్నమైన చిత్రాలను సెలెక్ట్ చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 'గమ్యం' 'ప్రస్థానం' 'అందరి బంధువయా' 'రన్ రాజా రన్' 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' 'ఎక్సప్రెస్ రాజా' 'శతమానం భవతి' 'మహానుభావుడు' సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు. 'పడి పడి లేచే మనసు' 'రణ రంగం' 'జాను' చిత్రాలు ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో తదుపరి సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు శర్వా. ఈ క్రమంలో 'శ్రీకారం' అనే సినిమాకి శ్రీకారం చుట్టాడు శర్వా. ఈ చిత్రానికి కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా 14 రీల్స్ రామ్ ఆచంట - గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఎస్ ఆర్ ప్రభు నిర్మాణంలో శ్రీ కార్తీక్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఓ బైలింగ్యువల్ చిత్రం చేయనున్నాడు.కాగా లేటెస్టుగా శర్వానంద్ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు. ఈ చిత్రాన్ని ఏసియన్ సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్ మరియు పుష్కర్ రామ్ ఎమ్ రావ్ కలిసి నిర్మించనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి డైరెక్టర్ మరియు నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తామని నిర్మాతలు ప్రకటించారు. అయితే అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహాసముద్రం' అనే మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శర్వానంద్ తదుపరి సినిమాగా ఏ ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉండగా ప్రొడ్యూసర్స్ గా మారిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ వారు ఇప్పటికే అక్కినేని నాగ చైతన్య - శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో 'లవ్ స్టోరీ' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో యువ హీరో నాగ శౌర్య కెరీర్లో 20వ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. యువ హీరో నిఖిల్ తో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు. దీంతో పాటు కింగ్ నాగార్జున - ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో ఓ భారీ బడ్జెట్ యాక్షన్ మూవీని ప్రొడ్యూస్ చేయనున్నారు. అంతేకాకుండా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్ట్ నిర్మించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. మొత్తం మీద నిర్మాణరంగంలోకి అడుగుపెట్టి ఏసియన్ వారు వరుసపెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు.