శర్వా ఎప్పటికీ నిర్మాతల హీరోనే..!

Fri Feb 18 2022 20:00:01 GMT+0530 (India Standard Time)

Sharwa will always be the hero of the producers ..!

కెరీర్ ప్రారంభంలో సపోర్టింగ్ రోల్స్ లో అలరించిన వర్సటైల్ యాక్టర్ శర్వానంద్.. ఇప్పుడు హీరోగా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఒకే జోనర్ కు పరిమితం కాకుండా.. విభిన్నమైన కథలు విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో అన్ని వర్గాల ఆడియన్స్ లోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు.సినిమాలను పక్కన పెడితే వ్యక్తిగతంగానూ శర్వాను అందరూ ఇష్టపడుతుంటారు. ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే హీరోల్లో శర్వానంద్ కూడా ఒకరు. ఎప్పుడూ ఎవరితో ఏ సమస్య లేకుండా.. తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంతేకాదు స్నేహానికి బాగా విలువ ఇస్తారని.. తనని నమ్ముకున్నవారి కోసం నిలబడతారని అంటుంటారు.

మొదటి నుంచీ కూడా శర్వాకు నిర్మాతల హీరో అనే పేరుంది. రెమ్యూనరేషన్స్ విషయంలో ఇబ్బంది పెట్టకుండా.. అనుకున్న దాంట్లోనే సినిమా కంప్లీట్ అయ్యేలా ప్రొడ్యూసర్స్ కు తన వంతు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ సినిమా ఫలితం కొంచం అటూఇటూ అయినా.. వారిని ఆదుకోవడానికి ముందుకు వస్తుంటారు.

తనతో సినిమా తీసి నష్టపోయిన నిర్మాతలను పిలిచి మరీ మరో ప్రాజెక్ట్ ఇస్తుంటారు. అందుకే శర్వాతో ప్రొడ్యూసర్స్ మంచి సంబంధాలు కలిగి ఉండటమే కాదు.. ఆయనతో మళ్ళీ మళ్ళీ సినిమాలు చేయడానికి రెడీగా ఉంటారు. ఇంతకముందు 'శ్రీకారం' విషయంలో 14 రీల్స్ ప్లస్ తో వివాదం కూడా ఏదో మిస్ కమ్యూనికేషన్ వల్లనే జరిగిందని తెలుస్తోంది.

లేటెస్టుగా శర్వా నటించిన సినిమా 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇదే సంస్థలో గతంలో 'పడిపడి లేచెను మనసు' అనే మూవీ చేసారు. డీసెంట్ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.

అయినప్పటికీ నిర్మాత సుధాకర్ భారీ స్థాయిలో శర్వానంద్ తో 'ఆడవాళ్ళు..' సినిమా నిర్మించారు. యువ హీరో ప్రొడ్యూసర్స్ హీరో అనడానికి ఇంతకంటే మరో ఉదాహరణ అవసరం లేదు. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా శర్వా లైనప్ లో ఎప్పుడూ రెండు మూడు సినిమాలు ఉంటున్నాయంటేనే వారితో అతనికి ఎలాంటి సత్సంబంధాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే శర్వాకు ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. గతంలో వర్సటైల్ హీరో నటించిన ప్యూర్ క్లాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు కొన్ని బ్లాక్ బస్టర్‌లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'  ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో శర్వానంద్ సరసన లక్కీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఖుష్బు - రాధిక శరత్ కుమార్ - ఊర్వశి కీలక పాత్రలు పోషించారు.

ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - ట్రైలర్ - పాటలు మంచి స్పందన తెచ్చుకుని సినిమాపై అంచనాలు పెంచేసాయి. ఈ మూవీపై క్రియేట్ అయిన బజ్ తో ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. నాన్ థియేట్రికల్ హక్కులు దాదాపు 25 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయాయని తెలుస్తోంది. మొత్తం మీద 'ఆడవాళ్ళు..' నిర్మాత విడుదలకు ముందే 15 కోట్ల టేబుల్ ఫ్రాఫిట్ తోం ఉన్నారని టాక్.

'ఆడవాళ్ళు మీకు జోహార్లు' చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడింటింగ్ వర్క్ చేసారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. చాలా కాలంగా సాలిడ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న శర్వానంద్ కు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.