లాల్ సింగ్ చడ్డాలో షారూక్ షాకింగ్ అవతార్

Wed Aug 10 2022 06:00:02 GMT+0530 (India Standard Time)

Shah Rukh shocking avatar in LaalSinghChaddha

మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన `లాల్ సింగ్ చడ్డా` పాన్ ఇండియా కేటగిరీలో విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పలువురు అతిథులు తళుక్కున మెరుస్తారన్న టాక్ కూడా ఉంది. అయితే ఇందులో అక్కినేని హీరో నాగచైతన్య కాస్త ప్రాధాన్యత ఉన్న అతిథి పాత్రలో నటించాడు.విడుదల దగ్గర పడుతున్న కొద్దీ లాల్ సింగ్ గురించిన చాలా విషయాలను మీడియా ముందు ఓపెనవుతున్నాడు అమీర్ ఖాన్. పాన్ ఇండియా హిట్టు కొట్టాలన్న కసితో ఎంతగానో శ్రమించిన అతడు ఒక మంచి క్లాసిక్ ని తెరకెక్కించినా కానీ ఇటీవలి హిందీ పరిశ్రమ రికార్డు చెత్తగా ఉండడంతో ఎంతో కంగారుగా ఉన్నాడు.

అదే క్రమంలో ప్రచారం పరంగా ఏ లోటూ లేకుండా తనవంతుగా ప్రయత్నిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన స్నేహితుడు కింగ్ ఖాన్ షారూఖ్ `లాల్ సింగ్ చడ్డా`లో అతిథి పాత్రలో కనిపిస్తారని  అమీర్ ఖాన్ ఎట్టకేలకు ధృవీకరించారు. ఈ ఇంటర్వ్యూలో షారూఖ్ ను సినిమాలో భాగం చేసేందుకు తనని ఎలా ఒప్పించాడో వెల్లడించాడు. అయితే అభిమానులు షారుక్ ని ఏ పాత్రలో చూస్తారనే విషయాన్ని మాత్రం అమీర్ వెల్లడించలేదు.

`లాల్ సింగ్ చడ్డా` చిత్రంలో అమీర్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో లాల్ (అమీర్) తన కలలను నిజం చేసుకోవాలని.. తన  ప్రేమను దక్కించుకోవాలని చేసే ప్రయాణాన్ని తెరపై ఆవిష్కరించారు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరీనా కపూర్ ఖాన్ అమీర్ కి ప్రియురాలిగా కనిపిస్తుంది. నాగ చైతన్య ఇందులో ఇండియన్ ఆర్మీ బేస్ క్యాంప్ లో లాల్ కి స్నేహితుడిగా కనిపిస్తాడు. బార్డర్ లో ఆ ఇద్దరి మధ్యా ఇంట్రెస్టింగ్ సీన్లు ఉన్నాయని ఇంతకుముందు రిలీజ్ చేసిన ట్రైలర్ వెల్లడించింది.

షారుఖ్ ఖాన్ ఎంపిక గురించి అమీర్ మాట్లాడుతూ.. అమీర్ నాకు మంచి స్నేహితుడు.. మూవీకి అతడు కావాలి. ఇందులో కథ ప్రకారం.. అమెరికాలో ఎల్విస్ (ప్రెస్లీ) అనే వ్యక్తి నాకు అవసరమని షారూక్ తో చెప్పాను. భారతదేశపు అతిపెద్ద ఐకానిక్ స్టార్ ఈ పాత్రకు కావాలి.. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను! (నవ్వుతూ) అని అన్నాను. సరే అని అతడు అన్నాడని తెలిపారు.

షారూఖ్ కానీ అమీర్ కానీ ఈ పాత్ర గురించి మునుపెన్నడూ ఎక్కడా మాట్లాడలేదు. `లాల్ సింగ్ చడ్డా` టీమ్ ఇప్పటివరకు సినిమాలో ఈ పాత్ర గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఈ ఏడాది ప్రారంభంలో షారుఖ్ ట్విట్టర్ లో `ఆస్క్ మీ ఎనీథింగ్` సెషన్ ను నిర్వహించారు. ఒక అభిమాని అతన్ని `లాల్ సింగ్ చద్దా`లో మీరు నటించారా? అని ప్రశ్నించాడు. అర్రే యార్ అమీర్ కెహతా హై పెహ్లే పఠాన్ దిఖా (మొదట నాకు పఠాన్ చూపించు అని అమీర్ అంటున్నాడు)!! అని అతను బదులిచ్చాడు. అంతకుమించి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. లాల్ సింగ్ చడ్డాలో నటించిన విషయాన్ని అతడు ఓపెనవ్వలేదు. కానీ ఇప్పుడు అమీర్ ఖాన్ అతడు అతిథిగా నటించాడని ధృవీకరించారు. ఎల్విస్ ప్రెస్లీ ప్రముఖ పాప్ గాయకుడు.. ర్యాపర్.. రాక్ అండ్ రోల్ స్పెషలిస్టుగా గొప్ప ఎంటర్ టైనర్ గా పాపులరైన ఫేమస్ పర్సనాలిటీ. అలాంటి పాత్రలో కింగ్ ఖాన్ మెరుపులు మెరిపించడం ఖాయమని అర్థమవుతోంది. కనిపించేది తక్కువ సమయమే అయినా షారూక్ మెరుపులు అభిమానులకు ప్రత్యేక ట్రీట్ గా నిలుస్తాయనడంలో సందేహం లేదు.

`లాల్ సింగ్ చడ్డా` అనేది టామ్ హాంక్స్ నటించిన 1994 హాలీవుడ్ ఫీచర్ `ఫారెస్ట్ గంప్`కి అధికారిక హిందీ రీమేక్. వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ -అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల కానుంది.

అమీర్ కోసం స్క్రిప్టు రాసిన నటుడు

నటుడు అతుల్ కులకర్ణి వల్లనే `ఫారెస్ట్ గంప్` స్క్రిప్ట్ వర్క్ మొదలైంది. ఈ విషయాన్ని అతడు స్వయంగా ధృవీకరించాడు. ``నేను అమీర్ కోసం స్క్రిప్ట్ రాశాను. ఇదంతా దాదాపు 13-14 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఇప్పటికి అంతా బాగా పూర్తయి మూవీ రిలీజవుతున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. దీనిని అదృష్టంగా భావిస్తున్నాను. అమీర్ ఈ మూవీని ఇష్టపడి చేయాలని నిర్ణయించుకున్నాడు. మాకు నచ్చిన సినిమాల గురించి ప్రతిసారీ మాట్లాడుకుంటాం. అదే క్రమంలో కొన్నేళ్ల క్రితమే ఫారెస్ట్ గంప్ గురించిన చర్చా  వచ్చింది. మరుసటి రోజు షూటింగ్ కోసం ఎక్కడికో వెళ్లాల్సి ఉండగా అది క్యాన్సిల్ అయింది. అందుకే నా చేతుల్లో 10-15 రోజుల్లోనే ఫారెస్ట్ గంప్ పని మొదలైంది. నేను ఈ చిత్రాన్ని చాలా కాలంగా చూడలేదు.  కాబట్టి నేను ఇపపుడు లాల్ సింగ్ చడ్డా గా మారాక మళ్ళీ చూడాలని అనుకున్నాను`` అని అన్నారు.