Begin typing your search above and press return to search.

కొత్త బిల్లుతో పంపిణీ వ‌ర్గాల‌కు బిగ్ పంచ్

By:  Tupaki Desk   |   25 Nov 2021 7:43 AM GMT
కొత్త బిల్లుతో పంపిణీ వ‌ర్గాల‌కు బిగ్ పంచ్
X
టిక్కెట్టు రేట్ల స‌వ‌ర‌ణ.. ప్ర‌భుత్వ పోర్ట‌ల్ వంటి అంశాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సినీ రంగానికి తీర‌ని చేటుగా మార‌నున్నాయా? అంటే అవుననే ఒక సెక్ష‌న్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇది పంపిణీ వ‌ర్గాలు స‌హా బ‌య్య‌ర్ల‌కు న‌ష్టాల్ని మిగిల్చే వ్య‌వ‌హార‌మేన‌న్న భావ‌న నెల‌కొంది.

ఇప్ప‌టికే త‌గ్గిన టిక్కెట్టు ధ‌ర‌ల‌తో ఎగ్జిబిష‌న్ రంగానికి తీవ్రంగా న‌ష్టం వాటిల్లింద‌ని విశ్లేషిస్తున్నారు. క‌నీసం థియేట‌ర్ల‌లో కార్మికుల జీతాలు- మెయింటెనెన్స్ పరంగా అధిక‌ క‌రెంట్ బిల్స్.. జీఎస్టీ- ఇత‌ర ప‌న్నుల రూపంలో త‌డిసిమోపెడ‌య్యే బిల్స్ ని చెల్లించేందుకే ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితి ఉంద‌ని ఇప్ప‌టికే థియేట‌ర్ య‌జ‌మానుల నుంచి ఆవేద‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి.

అయితే తాజాగా ఏపీ ప్ర‌భుత్వం అధికారికంగా టికెటింగ్ పోర్ట‌ల్ ని ప్రారంభిస్తూ.. ప‌న్ను వ‌సూళ్లు స‌క్ర‌మం చేస్తున్నామ‌ని ఏకంగా సినిమాటోగ్ర‌ఫీ స‌వ‌ర‌ణ బిల్లును అధికారికంగా పాస్ చేసింది. దీంతో పంపిణీ వ‌ర్గాల‌కు దీనివ‌ల్ల ఏమేర‌కు క‌ష్టం న‌ష్టం ఉంటుంది? అన్న విశ్లేష‌ణ సాగుతోంది. అద‌న‌పు షోల ర‌ద్దు.. బెనిఫిట్ షోల ర‌ద్దు వ్య‌వ‌హారం కూడా ఇప్పుడు బ‌య్య‌ర్ల‌కు క‌ష్టం క‌లిగించేదేన‌నే విశ్లేష‌ణ సాగుతోంది.

అస‌లు థియేట‌ర్ల‌లో సినిమా ఆడేది తొలి మూడురోజులే. ఆ మూడు రోజులు అద‌న‌పు షోల పేరుతో ఎంతో కొంత రాబ‌ట్టే వారు. ఇక దానికి చెల్లు చీటీ వేసింది జ‌గ‌న్ ప్ర‌భుత్వం. దీనివ‌ల్ల‌ ఇప్ప‌టికే రిలీజ్ తేదీల్ని ప్ర‌క‌టించిన సినిమాల‌కు ఎక్కువ ధ‌ర‌ల్ని చెల్లించి డిస్ట్రిబ్యూట‌ర్లు బ‌య్య‌ర్లు కొనుగోళ్లు సాగించారు.

ముఖ్యంగా సంక్రాంతి బ‌రిలో ఉన్న భారీ పాన్ ఇండియా చిత్రాల కోసం పెద్ద మొత్తాల‌కు డీల్స్ సెట్ట‌య్యాయి. అయితే క‌లెక్ష‌న్లు ఆ రేంజులో వ‌స్తాయా? అంటే సందేహ‌మే. పెద్ద మొత్తాల్ని రాబ‌ట్టే స‌న్నివేశం ఇప్పుడు లేనే లేదు.

ముఖ్యంగా ఆంధ్రా ఏరియాలో టిక్కెట్టు ధ‌ర‌లు స‌హా వెబ్ పోర్ట‌ల్ తో క‌లెక్ష‌న్ల‌కు అన్ని ర‌కాలుగా గండి ప‌డిపోనుంద‌ని విశ్లేషిస్తున్నారు. ఇప్ప‌టికే దీనిపై తీవ్ర‌మైన ఆందోళ‌న పంపిణీ వ‌ర్గాల్లో నెల‌కొంది. దీంతో కొత్త‌ స్ట్ర‌క్చ‌ర్ అవ‌స‌ర‌మ‌ని నిర్మాత‌ల‌పైనా ఒత్తిడి తెస్తున్నార‌ని తెలిసింది.

ఇక ఏపీలో టికెట్ ధ‌ర‌ల పెరుగుద‌ల శూన్యం కాబ‌ట్టి .. ఇప్ప‌టికే కుదిరిన బేర‌సారాలను రీడిజైన్ చేయాల‌ని నిర్మాత‌ల‌పై పంపిణీ వ‌ర్గాల నుంచి ఒత్తిళ్లు వ‌స్తున్నాయ‌ట‌. ఒక‌ప్పటిలా రిట‌ర్నులు ఉండ‌వు కాబ‌ట్టి ఇక‌పై ఏపీలో పెద్ద మొత్తాలు వెచ్చించాలంటేనే పంపిణీ వ‌ర్గాలు ఝ‌డిసిపోతున్నాయ‌ట‌.

టాలీవుడ్ లో ద‌శాబ్ధాల పాటు సాగిన క్ర‌తువును ఒక్క‌సారిగా మార్చేయాల‌న్న ప్ర‌య‌త్నం ఏపీ ప్ర‌భుత్వం చేస్తోంది. దీనివ‌ల్ల స‌డెన్ గా ఏర్ప‌డిన స‌మ‌స్య ఇది అని కూడా ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. వారానికి ఓసారి సినిమా చూడానికి ఆడియెన్ థియేట‌ర్ల‌కు వ‌స్తారు. కానీ ఏపీలో కొత్త ప‌రిణామం వ‌ల్ల‌ సినీరంగానికి అంత ఫేవ‌ర్ గా లేద‌నే వాద‌న బ‌లంగానే వినిపిస్తోంది.