Begin typing your search above and press return to search.

‘తలైవి’కి సీక్వెల్ రెడీ అవుతోందట

By:  Tupaki Desk   |   23 Sep 2021 5:30 PM GMT
‘తలైవి’కి సీక్వెల్ రెడీ అవుతోందట
X
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'తలైవి' సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక చాలా కాలంలో పాటు విడుదల ఆపాల్సి వచ్చింది. అందుక్కారణం కరోనా మహమ్మారి. ఇలా ఆగి ఆగి చివరికి ఇటీవలే వినాయక చవితి కానుకగా సినిమాను తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు. కానీ బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రానికి చేదు అనుభవం ఎదురైంది. సినిమా బాగుందని విమర్శకులు ప్రశంసించినా, మంచి రివ్యూలు వచ్చినా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి ఈ సినిమా చూసేందుకు అంతగా ఆసక్తి ప్రదర్శించలేదు. తమిళంలో ఓ మోస్తరుగా ఆడిన 'తలైవి'.. తెలుగు, హిందీ భాషల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్‌కు మంచి ఆఫర్లు వచ్చినా టెంప్ట్ అవకుండా ఇన్ని నెలలు ఆగి సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసి చేదు అనుభవం ఎదుర్కొన్నాడు విష్ణువర్ధన్ ఇందూరి.

కాకపోతే నాన్ థియేట్రికల్ రైట్స్‌తోనే సినిమాకు లాభాలు వచ్చేయడంతో థియేట్రికల్ రెవెన్యూ విషయంలో బాధ పడాల్సిన అవసరం లేకపోయింది. మొత్తానికి 'తలైవి' సినిమా ఆయనకు మిశ్రమానుభూతులను మిగిల్చింది. ఇంతటితో ఈ సినిమా కథ ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ తాజా సమాచారం ఏంటంటే.. 'తలైవి'కి సీక్వెల్ రాబోతోందట. జయలలి నట జీవితంతో పాటు రాజకీయ ప్రయాణంలో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యే వరకే ఈ సినిమాలో చూపించడం తెలిసిందే. దీంతో కథ అసంపూర్తిగా ఉందని, కన్వీనియెంట్‌గా బయోపిక్‌ను ముగించారని.. ముఖ్యమంత్రి అయ్యాక వచ్చిన ఆరోపణలు, ఎదుర్కొన్న వివాదాల ప్రస్తావనే లేకుండా పోయిందని.. ఆమె జీవితాన్ని తెరపై ముగించలేదని విమర్శలు వచ్చాయి. ఐతే అన్నీ తెలిసే ఈ కథను ఇలా కన్వీనియెంట్‌గా ముగించారని అనుకున్నారు. కానీ సీక్వెల్ తీయడం ద్వారా ఈ కథను ముగించడానికి చిత్ర బృందం చూస్తోందట. థియేటర్లలో ఎలాంటి ఫలితం వచ్చినప్పటికీ నిర్మాతకు లాభాలు రావడంతో విజయేంద్ర ప్రసాద్‌తో సీక్వెల్ కోసం స్క్రిప్టు రెడీ చేయిస్తున్నారని.. 'తలైవి' కథ ముగిసిన దగ్గర్నుంచి జయలలిత జీవిత చరమాంకం వరకు ఇందులో చూపించబోతున్నారని అంటున్నారు.