టాప్ డైరెక్టర్ సీక్వెల్స్ పై పడ్డాడేంటో..?

Mon Jul 13 2020 10:00:02 GMT+0530 (IST)

Sequel To Oke Okkadu ?

సౌత్ ఇండియా దర్శకత దిగ్గజం శంకర్ ప్రస్తుతం ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే సినిమా పూర్తి అయ్యి విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా భారతీయుడు 2 కు అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. వచ్చే ఏడాదిలో ఎట్టి పరిస్థితుల్లో సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ సమయంలోనే శంకర్ మరో సినిమాకు సీక్వెల్ ను చేసేందుకు చర్చలు జరుపుతున్నాడనే వార్తలు కోలీవుడ్ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.1999లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒకే ఒక్కడు’ చిత్రం సెన్షేషనల్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో అర్జున్ హీరోగా నటించాడు. ఒక సామాన్య జర్నలిస్ట్ ఒక్క రోజు సీఎం అయితే ఎలా ఉంటుంది అనే విషయాన్ని దర్శకుడు శంకర్ చూపించాడు. తమిళంతో పాటు తెలుగు ఇంకా హిందీలో కూడా సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాను ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు శంకర్ చర్చలు జరుపుతున్నాడట.

ఒకే ఒక్కడు కాన్సెప్ట్ తో ఈసారి విజయ్ హీరోగా సీక్వెల్ ను రూపొందించేందుకు శంకర్ ఆసక్తిగా ఉన్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. శంకర్ దర్శకత్వంలో సినిమా అంటే విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. ఇండియన్2 సినిమా విడుదలకు ముందే ఒకే ఒక్కడు సినిమా సీక్వెల్ కు సంబంధించిన స్క్రిప్ట్ ను రెడీ చేయాలని శంకర్ భావిస్తున్నాడు. ఇండియన్ 2 చిత్రం విడుదల అయిన వెంటనే శంకర్ ఒకే ఒక్కడు మొదలు పెట్టే అవకాశం ఉందంటున్నారు.