Begin typing your search above and press return to search.

గేర్ మార్చుతున్న సీనియర్ హీరోయిన్!

By:  Tupaki Desk   |   20 Jan 2022 7:15 AM GMT
గేర్ మార్చుతున్న సీనియర్ హీరోయిన్!
X
మీరా జాస్మిన్ .. తెలుగు తెరపై కొంతకాలంగా కనిపించకపోయినా ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. చందమామకు రూపం వచ్చినట్టు .. శాపవశాత్తూ దేవకన్య భూలోకానికి వచ్చినట్టుగా అనిపించడం మీరా జాస్మిన్ ప్రత్యేకత. అందమైన నవ్వు ఆమెకి మాత్రమే సొంతమన్నట్టుగా కనిపిస్తుంది. 20 ఏళ్ల క్రితం మలయాళ సినిమాతో తన కెరియర్ ను మొదలుపెట్టిన మీరా జాస్మిన్, కొంతకాలం వరకూ మలయాళ .. తమిళ సినిమాలు మాత్రమే చేస్తూ వెళ్లింది. అక్కడి యూత్ మనసులను జల్లెడ పట్టేసిన తరువాతనే తెలుగు తెరవైపు చూసింది.

'అమ్మాయి బాగుంది' సినిమాతో ఈ బ్యూటీ తెలుగు తెరకి పరిచయమైంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా 'నిజంగానే అమ్మాయి చాలా బాగుంది' అనుకున్నారు. మంచి మార్కులు ఇస్తే మరికొన్ని సార్లు తెరపై చూడవచ్చని అలాగే చేశారు. దాంతో చాలా తక్కువ సమయంలోనే ఆమెకి స్టార్ హీరోల సరసన జట్టు కట్టే ఛాన్స్ వచ్చింది. బాలకృష్ణతో 'మహారథి' .. రవితేజతో 'భద్ర' .. పవన్ తో 'గుడుంబా శంకర్' .. రాజశేఖర్ తో 'గోరింటాకు' .. జగపతిబాబుతో 'బంగారుబాబు' సినిమాలు చేస్తూ వెళ్లింది.

అయితే వరుసగా సినిమాలు పడినట్టుగా .. విజయాలు మాత్రం పడలేదు. దాంతో సహజంగానే వెనుకబడిపోయింది. ఆ తరువాత ఆమె మలయాళ సినిమాలు వరుసగా చేస్తూ వెళుతోంది. ఇక ఇప్పుడు ఆమె తన వయసుకు తగిన పాత్రలతో సెకండ్ ఇన్నింగ్స్ లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. రీసెంట్ గా ఆమె ఇన్ స్టాలో అడుగుపెట్టింది. ఆమె తీసుకున్న ఆ నిర్ణయం పట్ల సన్నిహితులు హర్షాన్ని ప్రకటించారు. అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆమె ఇలా ఇన్ స్టాకి క్లాప్ కొట్టేసిందో లేదో, 23,700 ఫాలోవర్స్ పొలోమంటూ వచ్చేశారు.

తన ఫాలోయింగ్ కి .. ఫాలోవర్స్ కి మురిసిపోతున్న మీరా జాస్మిన్, తాను కూడా మరికొంతమంది స్టార్స్ ను ఫాలో అవుతోంది. మొత్తానికి మరింత యాక్టివ్ గా అభిమానులకు టచ్ లో ఉండాలనే ఉద్దేశంతోనే మీరా జాస్మిన్ రంగంలోకి దిగిందనుకోవాలి. స్పీడ్ పెంచడం కోసం గేర్ మార్చిందనే భావించాలి. ఆమె తోటి సీనియర్ హీరోయిన్లంతా కూడా తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నారు. అక్కా .. వదిన పాత్రలలో కూడా భారీ పారితోషికమే అందుకుంటున్నారు. మరి తెలుగులో రీ ఎంట్రీ గురించి మీరా కూడా ఏమైనా ఆలోచన చేస్తుందేమో చూడాలి.