యంగ్ హీరోలతో పోటాపోటీగా సీనియర్ స్టార్ హీరోలు

Tue Feb 23 2021 09:01:26 GMT+0530 (IST)

Senior Star Heroes in competition with Young Heroes

టాలీవుడ్ ఇప్పుడు కళకళలాడిపోతోంది .. ఎక్కడ చూసినా సినిమా సందడి కనుల పండుగలా కనిపిస్తోంది. యంగ్ స్టార్ హీరోలంతా భారీ ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉన్నారు. ఆ తరువాత ప్రాజెక్టులను కూడా సెట్ చేసుకుని పక్కా ప్లానింగుతో దూసుకుపోతున్నారు. ఇక సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి .. బాలకృష్ణ .. నాగార్జున .. వెంకటేశ్ కూడా యంగ్ స్టార్ హీరోలతో పోటీపడుతుండటం విశేషం. వాళ్లంతా కూడా తమ ప్రాజెక్టులను పూర్తిచేసేపనిలో తీరికలేకుండా ఉన్నారు. ఈ ఏడాది రికార్డుల బాటలో వాళ్ల అడుగులు కూడా కనిపించనున్నాయి.చిరంజీవి సినిమా అంటే దాని రేంజ్ వేరుగా ఉంటుంది. బలమైన కథాకథనాలు .. భారీతనంతో అది ముందుకు సాగవలసి ఉంటుంది. ఆ బాధ్యతను ఈ సారి ఆయన కొరటాల శివపై పెట్టారు. అపజయమెరుగని దర్శకుడిగా అద్భుతాలు చేస్తున్న కొరటాల శివతో 'ఆచార్య' సినిమా చేస్తున్నాడు. ఇది మెగాస్టార్ ఇమేజ్ కి తగిన టైటిల్ .. కొత్త లుక్ తో చిరంజీవి చేస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య మే 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక బాలకృష్ణ తన తాజా చిత్రాన్ని బోయపాటితో చేస్తున్నాడు. 'సింహా' .. 'లెజెండ్' తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి ఉంది. ఈ సినిమాకి 'మోనార్క్' .. 'గాడ్ ఫాదర్' అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఆ తరువాత సినిమాను బాలకృష్ణ .. గోపీచంద్ మలినేనితో చేయనున్నాడు.  

ఇక ఆల్రెడీ 'వైల్డ్ డాగ్' సినిమాను పూర్తిచేసిన నాగార్జున ప్రవీణ్ సత్తారుతో మరో ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గానే ఈ సినిమా రూపొందుతోంది. వెంకటేశ్ విషయానికొస్తే ఆయన కూడా 'నారప్ప' సినిమాను పూర్తిచేశాడు. వైవిధ్యభరితమైన ఈ సినిమాను మే 14వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో పాటు ఆయన అనిల్ రావిపూడితో 'ఎఫ్ 3' సినిమా చేస్తున్నాడు. గతంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'ఎఫ్ 2'కు ఇది సీక్వెల్.  ఇలా ఈ ఏడాది చిరంజీవి భారీ ప్రాజెక్టుగా 'ఆచార్య'ను మాత్రమే రంగంలోకి దింపుతూ ఉండగా బాలకృష్ణ .. నాగార్జున .. వెంకటేశ్ రెండేసి సినిమాలతో సందడి చేయనున్నారు. నిజంగా ఈ ఏడాది తెలుగు తెరకి ఉగాదినే!