Begin typing your search above and press return to search.

సీనియర్ మోస్ట్‌ రైటర్‌ డైరెక్టర్ గా ఎంట్రీ

By:  Tupaki Desk   |   20 Jun 2021 10:30 AM GMT
సీనియర్ మోస్ట్‌ రైటర్‌ డైరెక్టర్ గా ఎంట్రీ
X
టాలీవుడ్‌ లో రచయితలు ఎంతో మంది దర్శకులుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. రచయితలుగా ఎన్నో సూపర్‌ హిట్ చిత్రాలను అందించిన వారు దర్శకులుగా కూడా సక్సెస్ అయిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతం టాప్ డైరెక్టర్స్ అయిన త్రివిక్రమ్‌.. కొటాల శివలు కెరీర్‌ ఆరంభంలో రైటర్స్ గా చేసిన వారే. ఇంకా ఎంతో మంది రైటర్స్ కూడా ప్రస్తుతం డైరెక్టర్స్ గా ఉన్నారు. కొందరు మాత్రం రైటర్స్ గా సక్సెస్‌ అయ్యి దర్శకులుగా నిరాశ పర్చారు. ఇప్పుడు మరో సీనియర్ మోస్ట్ రైటర్‌ దర్శకుడిగా వెండి తెరపై ఎంట్రీకి సిద్దం అయ్యాడు.

మూడు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్న ఎల్బీ శ్రీరామ్‌ నటుడిగానే కాకుండా రచయితగా కూడా పలు సినిమాలకు వర్క్‌ చేశాడు. ముఖ్యంగా ఈయన ఈవీవీ వారి సినిమా లకు ఎక్కువగా తన కలం ను అందించాడు. ఎన్నో కథలను అందించడంతో పాటు మాటల రచయితగా కూడా ఆయనకు మంచి పేరు ఉంది. అలాంటి ఎల్బీ శ్రీరామ్‌ ఇప్పటికే పలు షార్ట్‌ ఫిల్మ్‌ లు తీసి కొన్నింటికి అవార్డులను కూడా దక్కించుకున్నారు. అలాంటి ఎల్బీ శ్రీరామ్‌ ఇప్పుడు ఒక బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యారు.

ప్రముఖ తెలుగు కవి గుర్రం జాషువా జీవిత కథ ఆధారంగా సినిమా ను తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా కోసం ఇప్పటికే ఎల్బీ శ్రీరామ్‌ స్క్రిప్ట్‌ ను రెడీ చేశారు. పలువురు రచయితలతో కలిసి ఆయన ఈ స్క్రిప్ట్‌ ను రెడీ చేశారట. త్వరలోనే చిత్రీకరణ కూడా మొదలు పెట్టబోతున్నట్లుగా చెబుతున్నారు. చిన్నతనంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న గుర్రం జాషువా ఎలా సమాజంలో మార్పు తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు అనేది సినిమా లో ఎల్బీ శ్రీరామ్‌ చూపించ బోతున్నట్లుగా తెలుస్తోంది.