Begin typing your search above and press return to search.

ఆ సినిమా చూసి దాసరి చాలా ఫీలయ్యారట!

By:  Tupaki Desk   |   8 Jun 2021 5:30 PM GMT
ఆ సినిమా చూసి దాసరి చాలా ఫీలయ్యారట!
X
దాసరి నారాయణరావు .. దర్శకుడిగా .. నిర్మాతగా .. నటుడిగా .. రచయితగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. అప్పటికప్పుడు కథలు అల్లేయడం .. అక్కడికక్కడే పాటలు రాసేయడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. అలాంటి దాసరి నారాయణరావు, యువదర్శకులను .. రచయితలను ఎంతగానో ప్రోత్సహించేవారు. నటీనటులను కూడా అదే స్థాయిలో ఎంకరేజ్ చేసేవారు. కొత్త సినిమాలను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారు. ఆయన అభినందించారంటే అది ఒక సర్టిఫికెట్ లా అంతా భావించేవారు.

అలాంటి దాసరి నారాయణరావు ఒక సినిమాను చూసి, తనకి అలాంటి ఆలోచన రానందుకు ఈర్ష్యగా ఉందని అన్నారట. ఆ సినిమా పేరే .. 'చిత్రం భళారే విచిత్రం'. పి.ఎన్. రామచంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, సీనియర్ నరేశ్ .. శుభలేఖ సుధాకర్ .. 'మహర్షి' రాఘవ .. బ్రహ్మానందం .. కోట .. ప్రధానమైన పాత్రలను పోషించారు. 1991లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. హాస్యరస భరితమైన సినిమాలలో ఇప్పటికీ ఇది ముందువరుసలో కనిపిస్తుంది. తాజాగా ఈ సినిమా 30 ఏళ్లను పూర్తిచేసుకున్న సందర్భంగా సీనియర్ నరేశ్ మాట్లాడారు.

"ఈ సినిమా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ .. ఈ తరం ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. యూ ట్యూబ్ లో ఈ సినిమా చూసినవారు నాకు కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటికీ ఈ సినిమాకి ఉన్న స్పందన చూస్తుంటే, పార్టు 2 తీయాలనిపిస్తోంది. ఈ కథ విన్నప్పుడే గన్ షాట్ గా ఈ సినిమా హిట్ అవుతుందని చెప్పాను. లేడీ క్యారెక్టర్ కోసం రెండు నెలలపాటు కసరత్తు చేశాను. దాసరిగారు ఈ సినిమాను థియేటర్లో చూసి, "ఈ సినిమా చూస్తుంటే నాకు చాలా ఈర్ష్య కలుగుతుందయ్యా .. నరేశ్ ను పెట్టుకుని లేడీ గెటప్ లో ఒక సినిమా చేయాలనే ఆలోచన నాకు ఎందుకు రాలేదు?" అన్నారట. దీనిని బట్టి ఈ సినిమా ఎంత బాగా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు" అని నరేశ్ అన్నారు.