'ఎన్టీఆర్ 20 ఏళ్ల క్రితమే ఎప్పటికైనా సీఎం అవుతానని చెప్పేవాడు'

Mon May 03 2021 18:35:03 GMT+0530 (IST)

Senior Co Director G.K.Chowdary About Jr NTR

నందమూరి తారక రామారావు వారసులుగా అటు సినీ ఇండస్ట్రీలోకి ఇటు రాజకీయాల్లోకి ఆయన ఫ్యామిలీ నుంచి అనేక మంది ఎంట్రీ ఇచ్చారు. హరికృష్ణ - బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాలలో కూడా పాల్గొన్నారు. తాత పోలికలు పునికి పుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో హీరోగా సత్తా చాటుతూనే.. తన తాత స్థాపించిన పార్టీ కోసం ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తరుపున తారక్ 2009లో ప్రచారం చేసినా.. ఆ తర్వాత ఎందుకో టీడీపీ అధిష్టానం ఆయన్ని దూరం పెడుతూ వచ్చింది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. కేవలం 23 సీట్లకు మాత్రమే పరిమితమైన టీడీపీ.  ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదని కార్యకర్తలు అభిప్రాయానికి వచ్చేసారు. పార్టీని దారుణమైన స్థితి నుండి బయటపడేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ఆశాకిరణంగా మారతాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ జూ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు అని నందమూరి ఫ్యాన్స్ ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు. భవిష్యత్ లో తారక్ సీఎం కావాలని ఆయన అభిమానులు బలంగా కోరుకుంటున్నారనడానికి ఇటీవల కొన్ని ఈవెంట్స్ లో వారు చేస్తున్న 'సీఎం సీఎం' అనే నినాదాలే నిదర్శనం. 'తెల్లవారితే గురువారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతున్న సమయంలో అందరూ సిఎం సిఎం అంటూ మాట్లాడుతున్నంత సేపు కూడా అలా అరుస్తూనే ఉన్నారు. ఆగండి బ్రదర్.. ఆగమని చెప్తున్నానా అంటూ సీరియస్ అయ్యే వరకు ఆగలేదు. అయితే 20 ఏళ్ల క్రితమే ఎప్పటికైనా సీఎం అవుతానని నమ్మకంగా చెప్పేవాడని తెలుస్తోంది.

ఎన్టీఆర్ హీరోగా 2001లో వచ్చిన 'సుబ్బు' సినిమాకు వర్క్ చేసిన కోడైరెక్టర్ జీకే చౌదరి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఎన్టీఆర్ చాలా మంచివాడని.. 10 ఏళ్ళు సినిమాలు చేసి ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పేవాడని కో డైరెక్టర్ చెప్పారు. పదేళ్ల తర్వాత నేను ఎలా ఉంటానో నాకు తెలుసు.. అప్పటి వరకు సినీ ఇండస్ట్రీలో హీరోగా చేసి పాలిటిక్స్ లోకి వెళ్లాను.. ఆ తర్వాత సీఎం నేనే అని 20 ఏళ్ల క్రితమే ఎన్టీఆర్ చెప్పే వాడని జీకే అన్నారు. ఇప్పుడు వీళ్లంతా ఎన్టీఆర్ సీఎం అవుతారని అంటున్నారు.. ఆయన అప్పుడే నాకు చెప్పారు.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే నెక్స్ట్ సీఎం ఆయనే అని కోడైరెక్టర్ జీకే చౌదరి చెప్పుకొచ్చారు. రాజకీయంగా ఇప్పుడు సైలెంటుగా ఉంటున్న ఎన్టీఆర్ మరి అభిమానుల కోరిక మేరకు త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.