Begin typing your search above and press return to search.

'లవ్ స్టోరీ'ని మించి శేఖర్ కమ్ముల ఏం చెప్పబోతున్నాడో..?

By:  Tupaki Desk   |   15 Sep 2021 9:30 AM GMT
లవ్ స్టోరీని మించి శేఖర్ కమ్ముల ఏం చెప్పబోతున్నాడో..?
X
అక్కినేని నాగ చైతన్య - సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన ప్రేమకథా చిత్రం ''లవ్ స్టోరీ''. అప్పుడెప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా ప్రభావం వల్ల వాయిదా పడుతూ వచ్చింది. సినీ అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న ఈ చిత్రాన్ని.. సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన 'లవ్ స్టోరీ' పోస్టర్స్ - టీజర్ - సాంగ్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ యూట్యూబ్ లో మిలియన్ల కొలదీ వ్యూస్ తో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ 'యూ/ఏ' (U/A) సర్టిఫికేట్ జారీ చేసింది. సినిమా రన్ టైమ్ 2గంటల 46నిమిషాలు (165.28 నిమిషాలు) వచ్చింది.

ఇప్పటి వరకు శేఖర్ కమ్ముల సినిమాలలో ఎక్కువ శాతం క్లీన్ 'యూ' సెన్సార్ సర్టిఫికేట్ వచ్చినవే ఉన్నాయి. సున్నితమైన ప్రేమకథలకు తనదైన శైలిలో భావోద్వేగాలు కలబోసి సినిమాలు తీస్తారు కాబట్టి.. వైలెన్స్ - అశ్లీలత వంటి వాటికి తావే ఉండదు. అందుకే శేఖర్ కమ్ముల చిత్రాలను పిల్లలతో పాటు ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూసేలా 'U' సర్టిఫికెట్ వస్తుంది.

కానీ 'లవ్ స్టోరీ' చిత్రానికి 'U/A' సర్టిఫికెట్ రావడంతో శేఖర్ కమ్ముల ఇందులో ప్రేమకథను మించి ఏమి చూపించబోతున్నారో అనే ఆసక్తి అందరిలోనూ ఎక్కువైంది. ఇది ఆర్థిక స్థితిమంతులైన ఫ్యామిలీకి చెందిన హీరోయిన్ కి.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన హీరోకి మధ్య ఏర్పడిన ప్రేమ నేపథ్యంలో జరిగే కథ అని ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది.

శేఖర్ కమ్ముల గత చిత్రాల తరహాలోనే 'లవ్ స్టొరీ' చిత్రాన్ని మంచి ఫీల్ గుడ్ మూవీగా తీశారని అందరూ అనుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు 'యూ/ఏ' సర్టిఫికెట్ రావడంతో ఇందులో యాక్షన్ తో పాటుగా పరువు హత్యలు వంటి మరేదైనా అంశాన్ని చెప్పబోతున్నారేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే కనుక నిజమైతే దర్శకుడు ఇంత తీవ్రమైన సమస్యను ఇంతకు ముందెప్పుడూ డీల్ చేయలేదు. మరి దీన్ని సినిమాలో ఎలా ప్రెజెంట్ చేశారో చూడాలి.

అలానే 'లవ్ స్టొరీ' చిత్రంలో డ్యాన్స్ కి ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య - సాయి పల్లవి లను ఇందులో డ్యాన్సర్స్ గా కనిపిస్తున్నారు. శేఖర్ కమ్ముల కెరీర్ లో డ్యాన్స్ నేపథ్యంలో వచ్చే ఏకైక సినిమా ఇదే అవుతుంది. ఏదేమైనా 'ఫిదా' వంటి సూపర్ హిట్ తర్వాత సెన్సిబుల్ డైరెక్టర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో 'లవ్ స్టోరీ' పై మంచి అంచనాలు నెలకొన్నాయని చెప్పవచ్చు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ - అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్ - పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. పవన్ సిహెచ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేశారు. 'లవ్ స్టోరి' చిత్రంలో రాజీవ్ కనకాల - ఈశ్వరీ రావు - దేవయాని - ఉత్తేజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.