OTTలకు ఫేవర్ చేసేందుకేనా సెకండ్ వేవ్?

Thu Apr 22 2021 18:00:01 GMT+0530 (IST)

Second Wave to Favor OTT?

ఇండస్ట్రీ బాస్ అల్లు అరవింద్ ముందు చూపు గురించి పరిశ్రమ అంతా ముచ్చటించుకుంటుంది. ఆయన ఒక బిజినెస్ ప్రారంభిస్తే అది సక్సెస్సే కానీ.. ఫెయిల్ అవ్వదని చెబుతారు. ఆహా -ఓటీటీని ఆయన ప్రారంభించిన అనంతరం కాలంలోనే ఊహించని విపత్తు వచ్చి పడింది. అదే కరోనా.దీని పుణ్యమా అని హఠాత్తుగా అమాంతం ఇండస్ట్రీలో కలకలం మొదలైంది. అంతే అనూహ్యంగా ఓటీటీ రంగం ఊపందుకుంది. ఆహాతో పాటు ఇతర ఓటీటీలకు ఇది పెద్దగానే కలిసొచ్చింది. సబ్ స్క్రైబర్లను పెంచుకునేందకు నిలబెట్టుకునేందుకు ఆహా సహా ఇతర సంస్థలన్నీ తమ ప్రయత్నాలు తాము చేసుకున్నాయి. దానికి తోడు కరోనా భయాలు బోలెడంత అండగా నిలిచాయి. అయితే ఓటీటీ ఎదిగే క్రమంలోనే థియేటర్ల రంగం దారుణంగా దెబ్బ తింది.

జనం థియేటర్లకు వెళ్లేందుకు భయపడడమే ఓటీటీలకు పెద్ద ప్లస్ అయ్యింది. అయితే కరోనా మొదటి వేవ్ ముగిశాక ఊహించని పరిస్థితి. వేవ్ ఇలా తగ్గగానే మళ్లీ ఓటీటీల కంటే థియేటర్లే మేలు అనుకుని జనం సినిమాలకు వచ్చారు. ఇది ఊహించని పరిణామం. అయితే అది నచ్చలేదేమో.. కరోనా మళ్లీ వెనక్కి వచ్చింది. ప్రస్తుతం సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ఇది ఎన్నాళ్లు? అంటే జనాలు అజాగ్రత్తగా ఉన్నన్నాళ్లు. ఈసారి వేవ్ తీవ్ర ప్రభావమే చూపుతోంది. అయితే మే చివరి వరకూ ఉధృతంగా కొనసాగి తర్వాత వెళుతుందనే కొందరు విశ్లేషిస్తున్నారు.

ఏదేమైనా కానీ ఈ రెండు వేవ్ ల వల్ల ఎగ్జిబిషన్ రంగం కోలుకోలేని దెబ్బ తింది. మొదటి వేవ్ వల్ల ఏడాది పాటు థియేటర్లు మూత పడ్డాయి. కార్మికులు రోడ్డున పడ్డారు. ఇప్పుడు సెకండ్ వేవ్ ప్రభావంతో మళ్లీ థియేటర్లు మూతు పడుతున్నాయి. ఏపీలో 50శాతం ఆక్యుపెన్సీ తో పాటు టిక్కెట్టు ధరల తగ్గింపుతో స్వచ్ఛందంగానే ఎగ్జిబిటర్లు థియేటర్లను మూసివేస్తున్నారు. మరోవైపు నైట్ కర్ఫ్యూలతో 8 పీఎం తెలంగాణలో థియేటర్లను బంద్ చేయాల్సి ఉండగా అసలు కొన్నాళ్ల పాటు తెరవకూడదని ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్నారట. దీంతో మరోసారి ఓటీటీలకు జీవం వచ్చింది. ఇంతకుముందు మొదటి వేవ్ సమయంలో ఏడెనిమిది నెలల పాటు ఓటీటీల హవా సాగింది. చాలా మంది నిర్మాతలు ఎంతో ఓపిగ్గా వేచి చూసి చివరికి ఓటీటీలకు తమ సినిమాల్ని కట్టబెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి రిపీటవుతోంది.

సెకండ్ వేవ్ ప్రభావంతో చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. అందరూ చెబుతున్నట్టు ఈ వేవ్ మరో రెండు మూడు నెలల్లో తగ్గకపోతే గనుక అటుపై ఓటీటీలకు అమ్ముకునేందుకు నిర్మాతలు సిద్ధమవుతారని అంచనా వేస్తున్నారు. ఇష్టం ఉన్నా లేకున్నా ఓటీటీలకు సినిమాల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుందనే అంటున్నారు.అయితే నాని లాంటి కొందరు హీరోలు ఓటీటీలకు అమ్మ వద్దని ఈ వేవ్ కొద్దిరోజులే అని నిర్మాతలను ఒప్పిస్తుండడం ఇక్కడ పరిశీలించదగినది. ఇక పెద్ద సినిమాల్ని నేరుగా ఓటీటీలకు అమ్మడం అన్నది జరగని పని.

ఏది ఏమైనా సెకండ్ వేవ్ భయపెట్టేస్తుంటే ఇప్పటికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి సందిగ్ధత నిర్మాతలకు ఉంది. కొన్నిటికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కరోనా మొదటి వేవ్ ఎన్నాళ్లు ఉంటుందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఒక ఏడాది లోపే సమాధానం దొరికింది. ఇప్పుడు సెకండ్ వేవ్ ఇంత ఉధృతంగా ఉంది కాబట్టి త్వరగా అదుపులోకి తెచ్చేందుకు మానవ ప్రయత్నం జరుగుతుందనే హోప్ ఇండస్ట్రీకి ఉండి ఉంటుంది. అప్పటివరకూ ఓటీటీలకు హోప్ ఉంటుంది. ఇక ఒక సెక్షన్ విశ్లేషణ ప్రకారం.. ఓటీటీ దారి ఓటీటీదే. థియేటర్ల దారి థియేటర్లదే. ఇదొక్కటే ఎగ్జిబిషన్ రంగానికి ఊపిరి పోసే హోప్.