రొమాన్స్ ను టచ్ చేస్తూ దూసుకెళుతున్న 'లక్ష్య' సాంగ్!

Sun Dec 05 2021 10:00:01 GMT+0530 (IST)

Saya Saya Lyrical Song From Lakshya

ఈ మధ్య నాగశౌర్య లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయటపడటానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే 'లక్ష్య' సినిమా చేశాడు. ఇది విలువిద్య నేపథ్యంలో నడిచే కథ. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు విలువిద్యలో విజేతగా నిలవాలనుకుంటాడు. అందుకోసం ఆయన చేసిన సాధన .. ఆ ప్రయాణంలో ఎదురయ్యే అవాంతరాలు .. వాటిని అధిగమించిన తీరు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ పాత్ర కోసం సిక్స్ ప్యాక్ అవసరమేనని దర్శకుడు సంతోష్ చెప్పడంతో నాగశౌర్య గట్టిగానే కసరత్తు చేశాడట.ఇంతవరకూ తాను కనిపిస్తూ వచ్చినదానికి భిన్నమైన లుక్ తో ఆయన ఈ సినిమాలో కనిపిస్తాడు. కేతిక శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు ఒక కీలకమైన పాత్రను పోషించాడు. ఈ సినిమాకి కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన స్వరపరిచిన పాటల్లో నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగును రిలీజ్ చేశారు. 'ఆకాశమే తలే ఎత్తేనే నా ప్రేమ కొలిచేందుకే .. భూగోళమే పెంచే వేగమే నిను నన్ను కలిపేందుకే' అంటూ ఈ పాట సాగుతోంది. కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను జునైద్ కుమార్ ఆలపించాడు.

నాగశౌర్య - కేతిక శర్మపై ఈ పాటను చిత్రీకరించారు. కృష్ణకాంత్ చాలా తేలికైన పాదాలను వాడుతూ ఈ పాటను రాశాడు. నాయకా నాయికలు మాట్లాడుకున్నట్టుగా ఉంటుందే తప్ప లోతైన భావాలతో పాట పాడుకున్నట్టుగా ఉండదు. సాహిత్యం పరంగా చూసినా .. ట్యూన్ పరంగా చూసినా ఫరవాలేదు అనిపిస్తుందంతే. 'రొమాంటిక్' సినిమాలో బరువైన అందాలతో యూత్ ను తన వైపుకు తిప్పుకున్న కేతిక ఈ సినిమాలో కూడా అదే మంత్రం వేసి మాయ చేసేలానే కనిపిస్తోంది. ఈ సినిమాతో ఈ బ్యూటీకి మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశాలు పుష్కలంగానే కనిపిస్తున్నాయి.

'వరుడు కావలెను ' ఫలితం నిరాశపరచడం వలన ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో నాగశౌర్య ఉన్నాడు. 'వరుడు కావలెను' సినిమాకి లక్ష్మీ సౌజన్యకి అవకాశం ఇచ్చిన ఆయన ఈ సినిమాకి దర్శకుడిగా సంతోష్ కి ఛాన్స్ ఇవ్వడం విశేషం. నారాయణ దాస్ నారంగ్ .. రామ్మోహన్ రావు .. శరత్ మరార్ నిర్మించిన ఈ సినిమాను ఈ ఈనెల 10వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ రోజున సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా పుల్లెల గోపీచంద్ .. శేఖర్ కమ్ముల .. శర్వానంద్ హాజరుకానున్నారనే విషయం తెలిసిందే.