ఎట్టకేలకు రికార్డ్స్ క్రియేట్ చేసిన అక్కినేని హీరోలు..!

Tue Jul 07 2020 13:00:35 GMT+0530 (IST)

Savyasachi Hindi dubbing rakes in almost 100M views

సౌత్ సినిమాలకి నార్త్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంటదనే విషయం తెలిసిందే. ముఖ్యంగా మన తెలుగు సినిమాలకి అక్కడ విపరీతమైన ఆదరణ దక్కుతోంది. అందుకే తెలుగులో నిర్మితమవుతున్న ప్రతి సినిమాని హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ ప్లాప్ అయిన సినిమాలకి కూడా మిలియన్ల కొలది వ్యూస్ వస్తున్నాయంటేనే తెలుగు సినిమాలకి ఉండే క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఇప్పటికే హిందీలో డబ్బింగ్ చేసిన రిలీజ్ చేసిన సినిమాలలో రామ్ పోతినేని నటించిన 'నేను శైలజ' 'ఉన్నది ఒకటే జిందగీ' 'ఇస్మార్ట్ శంకర్'.. నితిన్ 'అ ఆ' 'చల్ మోహన్ రంగా' 'శ్రీనివాస కల్యాణం'.. అల్లు అర్జున్ 'సరైనోడు' 'డీజే దువ్వాడ జగన్నాథం'.. బెల్లకొండ శ్రీనివాస్ 'కవచం' 'జయజానకీ నాయక' చిత్రాలు 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ సొంతం చేసుకున్నాయి. అయితే ఇప్పుడు హిందీ డబ్బింగ్ సినిమాతో యూట్యూబ్ రికార్డ్స్ లోకి అడుగు పెట్టాడు అక్కినేని నాగ చైతన్య.అక్కినేని కాంపౌండ్ లో ఇప్పటివరకు ఏ హీరో డబ్బింగ్ సినిమాలకి కూడా 100 మిలియన్ వ్యూస్ రాలేదు. అయితే ఇప్పుడు అక్కినేని నాగ చైతన్య నటించిన 'సవ్యసాచి' సినిమా హిందీ డబ్బుడ్ వర్షన్ ఆదిత్య మూవీస్ వారు యూట్యూబ్ ఛానల్ లో 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ దక్కించుకుని రికార్డ్స్ క్రియేట్ చేసింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ఆశించినంతగా విజయం సాధించలేదు. ఈ సినిమాలో నిథి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా కీరవాణి సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం స్టోరీ కొత్తగా ఉన్నా కమర్షియల్ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ప్లాప్ గా మిగిలిపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని హిందీ ఆడియన్స్ మాత్రం తెగ చూసేస్తున్నారు. దీంతో పాటు నాగచైతన్య - సమంత జంటగా నటించిన 'మజిలీ' సినిమా కూడా 60 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించింది.

ఇక మరో అక్కినేని వారసుడు అఖిల్ నటించిన 'మిస్టర్ మజ్ను' సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ కూడా యూట్యూబ్ లో ఆల్ టైం రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమా యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన 40 గంటలలోపే 20 మిలియన్స్ వ్యూస్ తో పాటు 600K లైక్స్ సాధించి ఆల్ టైం రికార్డు సొంతం చేసుకుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన 'మిస్టర్ మజ్ను' సినిమాని బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు. తెలుగులో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిన ఈ సినిమాలో కూడా ఇస్మార్ట్ బ్యూటీ నిథి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. మొత్తం మీద అక్కినేని వారసుల ప్లాప్ సినిమాలు నార్త్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడంతో పాటు రికార్డ్స్ కూడా క్రియేట్ చేస్తున్నాయి.